Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 10 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు…

ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలికపై ఓ వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నోరు మూసుకోవాలని ఆ చిన్నారికి రూ.150 ఇచ్చి పంపించాడు. ఈ అమానుష ఘటనలో నిందితుడైన 28 ఏళ్ల మహమ్మద్ మున్నాను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగుళూరులో నివసిస్తున్న 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటోంది. అక్కడే నిర్మాణ పనులు చేస్తున్న బీహార్‌కు చెందిన మహమ్మద్ మున్నా, చిన్నారిని మాయమాటలతో పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం, ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించి, చేతిలో రూ.150 పెట్టి పంపించేశాడు.

చాలాసేపటి వరకు పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, తిరిగి వచ్చిన బాలిక చేతిలో డబ్బులు చూసి ప్రశ్నించారు. దీంతో భయపడుతూనే జరిగిన దారుణాన్ని చిన్నారి వారికి వివరించింది. వెంటనే కుటుంబసభ్యులు జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడు మున్నాను అదుపులోకి తీసుకున్నారు. “నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ కింద అత్యాచారం, చిన్నారులపై అఘాయిత్యాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది” అని సౌత్ వెస్ట్ బెంగుళూరు డీసీపీ తెలిపారు. బాధితురాలికి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. నిందితుడికి నేర చరిత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.