Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 10 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్‌కు కొత్త సీఎం!

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. దీంతో బీహార్‌లో నాయకత్వ మార్పు ఖాయమైపోయింది.

గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న నితీశ్ కుమార్, విలేకరులతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. “బీహార్‌లో నేను చాలా పనులు పూర్తి చేశాను. ఇకపై ఇక్కడే (ఢిల్లీలో) ఉండాలని భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మూడు, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాను. కొత్తగా ముఖ్యమంత్రి, మంత్రులు నియమితులవుతారు” అని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట జేడీ(యూ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఉన్నారు.

ఏప్రిల్ 13 తర్వాత బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని సంజయ్ ఝా ఇదివరకే సూచించగా, నితీశ్ తాజా వ్యాఖ్యలతో ఈ మార్పు వేగవంతం కానుందని తేలిపోయింది. మరోవైపు, ‘నితీశ్ మోడల్’ పాలనను కొనసాగిస్తామని, ఎన్డీయే కూటమి ఐక్యంగా ఉందని మంత్రి విజయ్ చౌదరి తెలిపారు.

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత నితీశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రిత్వ శాఖల పంపకాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వారు పాల్గొని, నాయకత్వ మార్పుపై చర్చించనున్నారు.