Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 14 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

పాదయాత్రకు వెళ్లే ముందు.. కవిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పు: కేటీఆర్ పై మహేశ్ గౌడ్ ధ్వజం

  • బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్న మహేశ్ గౌడ్
  • కేటీఆర్ ఏం చేసినా ప్రజలు క్షమించరని వ్యాఖ్య
  • కవిత ద్వారా అన్ని విషయాలు బయటపడుతున్నాయన్న టీపీసీసీ చీఫ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై, ఆ పార్టీ అగ్రనేతలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పదవులు కోల్పోయి విలవిలలాడుతున్నారని విమర్శించారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడంపై స్పందిస్తూ… ఆయన ఏం చేసినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను క్షమించే పరిస్థితి లేదని అన్నారు. పదేళ్లలో చేసిన అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పాదయాత్రకు వెళ్లే ముందు, తన చెల్లెలు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సంతోష్ రావు సంతోషం వెనుక ఉన్న రహస్యం ఏంటి? హరీశ్ రావు ఆనందం వెనుక ఉన్న దోపిడీ ఎంత? అనే విషయాలు కవిత ద్వారానే బయటపడుతున్నాయని సెటైర్లు వేశారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అడుగుతున్న ఆర్థిక లెక్కలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ అండ్ కో సతమతమవుతున్నారని అన్నారు. పదేళ్లపాటు అధికార ముసుగులో అడ్డగోలుగా దోపిడీ చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ప్రజల ఆదరణ కోల్పోయి పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.