Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 20 April 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే!

  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సైనస్ సర్జరీ
  • హైదరాబాద్‌ అపోలో ఆసుప‌త్రిలో ఎండోస్కోపిక్ విధానంలో చికిత్స
  • పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
  • చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం నాడు శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ముక్కుకు సంబంధించిన ‘ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ’ని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. అయితే, వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్‌కు కనీసం 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని స్పష్టం చేశారు.

పవన్ చాలా కాలంగా దీర్ఘకాలిక సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. మందులతో తగ్గకపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఎండోస్కోప్ ద్వారా నిర్వహించే ఈ సర్జరీలో సైనస్ మార్గాల్లో అడ్డంకులుగా ఉన్న పాలిప్స్‌ను, వాపును తొలగిస్తారు. భవిష్యత్తులో శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ సర్జరీ దోహదపడుతుంది. సర్జరీ అనంతరం వారం రోజుల పాటు బరువులు ఎత్తడం, ముక్కును గట్టిగా చీదడం వంటివి చేయకూడదని వైద్యులు సూచించారు.

గత కొన్నేళ్లుగా పవన్ సైనస్, ఆస్తమా, నడుం నొప్పితో పాటు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక పని ఒత్తిడి, దీక్షల కారణంగా ఆయన ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2018, 2024 సంవత్సరాల్లో తిరుమలకు నడకమార్గంలో వెళ్లినప్పుడు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు సర్జరీ జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పార్టీ శ్రేణులు, అభిమానులు కోరుకుంటున్నారు.