Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 05 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

ఈ నెల 9న బెంగాల్ లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం…

  • పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఘన విజయం
  • ఠాగూర్ జయంతి నాడు ప్రమాణస్వీకారం
  • సీఎం పదవికి రాజీనామా చేయాలని మమతను కోరనున్న గవర్నర్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ… ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మే 9వ తేదీన నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. ఠాగూర్ ఆశీస్సులతో రాష్ట్రంలో ఒక నూతన శకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈ తేదీని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈరోజే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను ఈసీ అధికారులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. రేపు సీఈసీ ఈ పత్రాలను గవర్నర్ ఆర్.ఎన్.రవికి సమర్పించనున్నారు. అనంతరం రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే వరకు మమతా బెనర్జీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన విధులను కొనసాగిస్తారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనప్పటికీ, బెంగాల్ పీఠాన్ని అధిరోహించబోయే ఆ ‘కీలక నేత’ ఎవరనే దానిపై బీజేపీ అధిష్ఠానం ఇంకా రహస్యాన్ని మెయింటైన్ చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సీఎం రేసులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని నందిగ్రామ్ లో ఓడించిన సువేందు.. ఈసారి ఎన్నికల్లో ఆమెను భవానీపూర్ లోనూ చిత్తు చేశారు.