Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 09 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

తమిళనాడు సీఎంగా విజయ్… రేపే ప్రమాణ స్వీకారం

  • ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు 
  • టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించిన వీసీకే, ఐయూఎంఎల్
  • 120 సీట్ల బలంతో గవర్నర్ ను కలిసిన విజయ్
  • విజయ్ తో భేటీ కోసం కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్
  • రేపు చెన్నై నెహ్రూ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం

తమిళ రాజకీయాల్లో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఈరోజు చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య, విజయ్ చెన్నైలోని లోక్‌భవన్‌లో ఇన్‌చార్జ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 120 మంది సభ్యుల మద్దతు తనకు ఉందని, ఇందుకు సంబంధించిన లేఖలను ఆయన గవర్నర్‌కు సమర్పించారు. విజయ్‌తో భేటీ కోసమే గవర్నర్ తన కేరళ పర్యటనను రద్దు చేసుకోవడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి విజయ్ గవర్నర్‌ను కలవడం ఇది నాలుగోసారి.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది సభ్యుల మద్దతు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. ప్రస్తుతం టీవీకే బలం 120కి చేరడంతో, విజయ్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అయింది. ఇవాళ వీసీకేతో పాటు ఐయూఎంఎల్ కూడా టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం.

విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. పలుచోట్ల బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.