Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

వాహనదారులకు షాక్: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు?

  • పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 4 నుంచి 5 పెరిగే అవకాశం
  • వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వరకు పెంపు యోచన
  • అంతర్జాతీయంగా 105 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
  • ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచేందుకు ప్రభుత్వ సన్నాహాలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లీటర్‌కు రూ. 4 నుంచి 5 వరకు, వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 40 నుంచి రూ. 50 వరకు పెంచాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భావిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీలోపే ఈ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 105 డాలర్లు దాటింది. ఇరాన్‌తో ఇజ్రాయెల్ యుద్ధం, కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుతం నెలకు సుమారు రూ. 30,000 కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రజలపై వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ, ఒకేసారి కాకుండా దశలవారీగా పెంపును అమలు చేయాలని యోచిస్తోంది. ఒకేసారి పెద్దమొత్తంలో ధరలు పెంచితే ద్రవ్యోల్బణం అదుపు తప్పిపోతుందన్న ఆందోళన ప్రభుత్వంలో ఉంది. అందువల్ల, మొదటి దశలో రూ. 4-5 పెంచి, ఆ తర్వాత నష్టాలు భర్తీ అయ్యేవరకు రూ. 2-4 చొప్పున పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉంది.

ఈ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుంది. పెరుగుతున్న చమురు ధరలకు తోడు, డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం దేశంపై రెట్టింపు భారాన్ని మోపుతోంది.