Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

బెంగాల్ లో కక్ష సాధింపు చర్యలు …అభిషేక్ బెనర్జీ జెడ్ ప్లస్ భద్రతా తొలగింపు ..

  • అభిషేక్ బెనర్జీకి షాక్.. ‘జెడ్-ప్లస్’ భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్
  • సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
  • పైలట్ వాహనంతో పాటు అదనపు భద్రతా సిబ్బంది ఉపసంహరణ
  • హోదా ప్రదర్శనకు భద్రత ఉండకూడదని సీఎం సువేందు వ్యాఖ్య
  • ఇకపై ఎంపీగా సాధారణ భద్రత మాత్రమే కొనసాగింపు

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్క్ పరిపాలన అందిస్తుంది ..అందులో భాగంగా ఇప్పటికే మాజీ సీఎం మమతా బెనర్జీ భద్రతను కుదించగా ,ఇప్పుడు టీఎంసీ ప్రధాన కార్యదర్శి ,లోకసభ సభ్యులు అభిషేక్ బెనర్జీకు ఉన్న జెడ్ ప్లస్ భద్రతను తొలగించారు ..దీంతో ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని విమర్శలు వస్తున్నాయి…

పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అందిస్తున్న ‘జెడ్-ప్లస్’ కేటగిరీ భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో అభిషేక్ బెనర్జీకి కేటాయించిన అదనపు భద్రతా సిబ్బందితో పాటు, ప్రత్యేక పైలట్ వాహన సదుపాయం కూడా ఇకపై అందుబాటులో ఉండదు.

గత 10 సంవత్సరాలకు పైగా అభిషేక్ బెనర్జీ ‘జెడ్-ప్లస్’ భద్రత పొందుతున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయన భద్రతను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి సువేందు అధికారి.. జిల్లా మేజిస్ట్రేట్లు, సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులకు నిజమైన భద్రతా ముప్పు లేనప్పుడు అనవసరమైన ఏర్పాట్లు చేయకూడదని స్పష్టం చేశారు. కేవలం హోదా ప్రదర్శన కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడమెందుకని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే అభిషేక్ భద్రతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అధికార మార్పిడి తర్వాత తొలుత అభిషేక్ బెనర్జీ కార్యాలయం వద్ద, ఆ తర్వాత ఆయన నివాసం వద్ద భద్రతను తగ్గించారు. ఇప్పుడు ‘జెడ్-ప్లస్’ కేటగిరీని పూర్తిగా రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద కూడా భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే.

తాజా ఆదేశాల ప్రకారం, అభిషేక్ బెనర్జీకి ఇకపై ఒక పార్లమెంటు సభ్యునికి సాధారణంగా అందించే భద్రత మాత్రమే ఉంటుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, అదనపు బలగాలను దశలవారీగా ఉపసంహరించుకుంటామని అధికారులు తెలిపారు.