Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు

అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం …చైనా కార్లు అమెరికాలో నిషేధం బిల్లు ..

  • అమెరికా ఆటో పరిశ్రమను కాపాడటమే లక్ష్యంగా బిల్లు
  • చైనాతోపాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వాహనాలపైనా నిషేధం
  • వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దశలవారీగా నిషేధం అమలు

చైనాకు చెందిన కనెక్టెడ్ వాహనాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సహా కొన్ని ప్రత్యర్థి దేశాల నుంచి దిగుమతయ్యే కనెక్టెడ్ వాహనాలు, వాటి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను నిషేధించేందుకు అమెరికాలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన చట్టసభ సభ్యులు కలిసి ఈ “కనెక్టెడ్ వెహికల్ సెక్యూరిటీ యాక్ట్”ను ప్రతిపాదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కనెక్టెడ్ వాహనాలు యూజర్ల లొకేషన్, వ్యక్తిగత సమాచారం వంటి సున్నితమైన డేటాను భారీ మొత్తంలో సేకరించి, పంపగలవని బిల్లులో పేర్కొన్నారు. వీటిని రిమోట్‌గా యాక్సెస్ చేసి, నియంత్రించే ప్రమాదం ఉందని చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తన అక్రమ వాణిజ్య పద్ధతులు, భారీ ప్రభుత్వ రాయితీలతో వాహనాలను తక్కువ ధరకు అమ్మి అమెరికా ఆటో పరిశ్రమను దెబ్బతీయాలని చూస్తోందని రిపబ్లికన్ ఎంపీ జాన్ మూలెనార్ ఆరోపించారు. BYD, CATL వంటి కొన్ని చైనా కంపెనీలు బానిస కార్మికులను ఉపయోగించుకోవడం ద్వారా ధరల విషయంలో అక్రమ ప్రయోజనం పొందుతున్నాయని ఆయన విమర్శించారు.

ఈ బిల్లు ప్రకారం చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాల నుంచి వచ్చే కనెక్టెడ్ వాహనాల అమ్మకాలు, తయారీ, దిగుమతులపై జనవరి 1, 2027 నుంచి నిషేధం అమలవుతుంది. అదే ఏడాది నుంచి ఈ దేశాలకు చెందిన వాహన సాఫ్ట్‌వేర్‌పై, 2030 నుంచి హార్డ్‌వేర్‌పై ఆంక్షలు అమల్లోకి వస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఒక్కో లావాదేవీకి కనీసం 1.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించనున్నారు.