Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 12 May 2026
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు.. మళ్లీ నిర్వహణకు ఎన్టీఏ నిర్ణయం…

  • ఈ నెల‌ 3న జరిగిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ
  • పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ నిర్ణయం   
  • సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగింత
  • పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడి

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా ప్రకటించింది. పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది.

పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మే 8న ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎన్టీఏ తెలిపింది. కేంద్ర ఏజెన్సీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నుంచి అందిన సమాచారం, దర్యాప్తు నివేదికల ఆధారంగా పరీక్ష ప్రక్రియ విశ్వసనీయతను కాపాడలేమని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మే 3న జరిగిన పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఎన్టీఏ తన ప్రకటనలో వివరించింది.

పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థులకు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగిస్తుందని అంగీకరించిన ఎన్టీఏ, జాతీయ పరీక్షా వ్యవస్థపై విశ్వసనీయతను, సమగ్రతను కాపాడేందుకు ఇది తప్పనిసరి అని పేర్కొంది. దర్యాప్తునకు సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన అన్ని రికార్డులను అందజేస్తామని హామీ ఇచ్చింది.

విద్యార్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేసేదిలేదు.. పాత రిజిస్ట్రేషన్లే వర్తిస్తాయి: ఎన్టీఏ
మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పాత రిజిస్ట్రేషన్ వివరాలే చెల్లుబాటు అవుతాయని, అదనపు పరీక్ష ఫీజు కూడా వసూలు చేయబోమని తెలిపింది. అంతేగాక‌ ఇప్పటికే చెల్లించిన ఫీజును విద్యార్థులకు తిరిగి వాపసు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల జారీకి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది.