పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేపై మధుయాష్కీ ఫైర్ …
సబిత ఇంద్రారెడ్డి సిగ్గు, శరం లేకుండా వెళ్లిపోయారు: మధు యాష్కి
కాంగ్రెస్ పార్టీని సబిత మోసం చేశారు
కాంగ్రెస్ వల్లే సుధీర్ రెడ్డి హుడా ఛైర్మన్ అయ్యారు
సుధీర్ రెడ్డి భాగోతం మొత్తం నాకు తెలుసు
టీపీసీసీ అధ్యక్షుడిగా ఈరోజు రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా హైదరాబాదులోని గాంధీభవన్ లో సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన నేతలపై నిప్పులు చెరిగారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భాగోతాలు అందరికీ తెలుసని… కాంగ్రెస్ భిక్షతోనే ఆయన హుడా ఛైర్మన్ పదవిని పొందారని చెప్పారు. హుడా ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఆంధ్ర నేత లగడపాటి రాజగోపాల్ తో కలిసి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
‘రేవంత్ రెడ్డిపై చెప్పులేస్తామని నోరు జారుతావా సుధీర్ రెడ్డీ?’ అంటూ మధు యాష్కి మండిపడ్డారు. ‘నీ భాగోతం నాకు తెలియదా? నేను కూడా మలక్ పేట్ నుంచే వచ్చా’ అని అన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డిని అడిగితే నీ భాగోతం మొత్తం బయటపెడతారని చెప్పారు.
ఇదే సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా మధు యాష్కి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు, శరం లేకుండా ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు, తమను కూడా మోసం చేశారని మండిపడ్డారు.