తెలంగాణ గడ్డపై ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’.ఆవిర్భావం :ప్రకటించిన షర్మిల
-షర్మిల వెంట తల్లి విజయమ్మ
-నేడు వైఎస్ జయంతి సందర్భంగా ప్రకటన
-సంక్షేమ రాజ్యం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని వెల్లడి
-ఆయన చూపిన బాటలోనే నడుస్తామని వెల్లడి
-జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారు… విజయమ్మ
-ఇది దైవనిర్ణయంమని విజయమ్మ వెల్లడి
-తన బిడ్డలకు దోచుకోవడం తెలియదన్న విజయమ్మ
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆమె ప్రసంగించారు. జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ నినాదాలతో షర్మిల తన ప్రసంగం ప్రారంభించారు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం వైఎస్సార్ అని తెలిపారు. మా నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్సార్ అని కొనియాడారు.
ఇవాళ ఆయన జయంతి అని, ఇది మనందరికీ పండుగ రోజని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడవడానికి, ఈ రోజు ఆయన పుట్టినరోజున మన పార్టీ ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ని స్థాపిస్తున్నామని షర్మిల ప్రకటన చేశారు. మరోసారి సంక్షేమ రాజ్యం తీసుకువచ్చేందుకు వైఎస్సార్ 72వ జయంతి రోజున ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ ఏర్పాటు ప్రకటన చేస్తున్నామని వెల్లడించారు.
షర్మిల పార్టీ ఏర్పాటు సభలో విజయమ్మ ప్రసంగం
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ, తన బిడ్డలు జగన్, షర్మిల చిత్తశుద్ధి, పట్టుదలలో తండ్రి వైఎస్ కు వారసులు అని స్పష్టం చేశారు. జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారని, ఇది దైవ నిర్ణయం అని వ్యాఖ్యానించారు. దోచుకోవడం, దాచుకోవడం తన బిడ్డలకు తెలియదని, పంచడం, సాయం చేయడమే వారికి తెలుసని అన్నారు. ఈ మూడు నెలల కాలంలో తన కుమార్తె షర్మిలపై ఎన్నో విమర్శలు వచ్చాయని, దుష్ప్రచారాలు జరిగాయని వెల్లడించారు.
వైఎస్ మరణం లేని నాయకుడని, అందరితో మమేకమై నడిచేవారే నిజమైన నాయకులు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్సార్ అని అభివర్ణించారు. తెలంగాణ బంగారుమయం కావాలనేది వైఎస్ స్వప్నం అని అన్నారు. వైఎస్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదని, ఆయన కల అసంపూర్తిగా మిగిలిందని విజయమ్మ తెలిపారు.
మరోవైపు షర్మిల పార్టీకి సంబంధించిన జెండా, షర్మిల ధరించనున్న కండువాలకు పార్టీ ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి చిలుకూరు బలాజీ ఆలయంలో పూజలు చేయించారు. తెలంగాణ పటంలో వైయస్సార్ బొమ్మతో పార్టీ జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంచితే, ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించిన షర్మిల… ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు . అక్కడ ఆమెకు మహిళలు ఘనంగా బోనాలతో స్వగతం పలికారు .
అక్కడి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయల్దేరి… పంజాగుట్ట సర్కిల్ లోని వైయస్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి, నివాళి అర్పించారు . అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని, పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పేరు ప్రకటినుంచి జెండా ఆవిష్కరించారు.