చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో భారీ వరదలు వెయ్యేళ్లలో చూడని వాన …
సబ్‌వే రైళ్లలో నడములోతు నీళ్లు
బాధితులు 12 లక్షల మందికిపైనే
ఉగ్రరూపం దాల్చిన ఎల్లో నది 25 మంది దుర్మరణం
పడవల్లా తేలియాడుతూ కొట్టుకుపోయిన కార్లు
యిహెతన్ ఆనకట్టను పేల్చేసిన పీఎల్‌ఏ
బీజింగ్
పెద్దపెద్ద భవంతుల ముందర భారీ చెరువులు.. నీటిపై తేలియాడుతూ వెళుతున్న కార్లు.. సబ్‌వే రైలు బోగీల్లో నడుము లోతు నీళ్లలో ప్రయాణికులు.. ఇదీ చైనాలోని సెంట్రల్ హెనన్ ప్రావిన్స్‌లో కనిపించిన వరద దృశ్యాలు. మరోలా చెప్పాలంటే ప్రకృతి సృష్టించిన విలయానికి సజీవ తార్కాణాలు. ఐఫోన్ సహా వివిధ పరిశ్రమలకు నిలయమైన హెనన్ ప్రావిన్స్‌లో గత వెయ్యేళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. ఎల్లో నది ఉగ్రరూపం దాల్చింది. వరదలు పోటెత్తాయి. ప్రావిన్స్‌లో దాదాపు అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. వరదల కారణంగా 12 మంది సబ్‌వే ప్రయాణికులు సహా మొత్తం 25 మంది మృత్యువాత పడ్డారు. 12.4 లక్షల మందిపై వరదల ప్రభావం పడిందని, అధికారులు ఇప్పటివరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి వరదనీరు పోటెత్తడంతో సబ్‌వే రైళ్లలో మరణాలు సంభవించినట్లు వివరించింది. ప్రావిన్స్ రాజధాని అయిన ఝెన్‌ఝౌలో పరిస్థితి భయానకంగా ఉంది. సబ్‌వే రైళ్లలో నడుములోతు నీళ్లలో చిక్కుకున్న ప్రయాణికులు సహాయం కోసం దీనంగా చూస్తున్న దృశ్యాలు, వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు, ప్రజలు వరద నీటిలోనే నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు పోతుండడం వంటి దృశ్యాలు సామాజిక మీడియాలో పోటెత్తుతున్నాయి. సబ్‌వేలో వరద నీరు క్రమంగా తగ్గుతోందని, ప్రయాణికులు సురక్షితమేనని బుధవారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. వరదల కారణంగా 160 వరకు రైలు సర్వీసులను, 260 విమాన సర్వీసులను రద్దు చేశామన్నారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్క రోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం
‘ఐఫోన్ సిటీ’గా పిలిచే హెనన్ ప్రావిన్స్ రాజధాని ఝెన్‌ఝౌలో మంగళవారం ఒక్క రోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. వరదలపై స్పందించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. సైన్యాన్ని (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పీఎల్‌ఏ) సహాయక చర్యల నిమిత్తం పంపించాలని ఆదేశించారు. ఝెన్‌ఝౌ నగరంలో విద్యుత్తు, మంచినీటి సరఫరా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఆసుపత్రులు సైతం అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బౌద్ధ సన్యాసుల యుద్ధ విద్యలకు నిలయమైన షావొలిన్ ఆలయం కూడా వరదలకు భారీగా దెబ్బతింది.
యిహెతన్ ఆనకట్టను పేల్చేసిన పీఎల్‌ఏ
క్షణక్షణానికి పెరుగుతున్న వరద నీటిని మళ్లించడానికి హెనన్ ప్రావిన్స్‌లోని యుచువాన్ కౌంటీలో దెబ్బతిన్న యిహెతన్ ఆనకట్టను చైనా సైన్యం పేల్చివేసింది. ఈ ఆనకట్టకు 20 మీటర్ల మేర పగుళ్లు ఏర్పడ్డాయని, ఏ సమయంలోనైనా కొట్టుకుపోవచ్చునని సామాజిక అనుసంధాన వేదికలో అంతకుముందే పీఎల్‌ఏ ప్రకటించింది.