సిద్దు ప్రమాణ స్వీకారానికి కెప్టెన్ అమరిందర్ …పక్క్కపక్కనే కూర్చొని కబుర్లు
-పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ ప్రమాణం.. పక్కనే కూర్చున్న సీఎం అమరీందర్ సింగ్
-చండీగఢ్‌లోని కాంగ్రెస్ భవన్‌లో కార్యక్రమం
-ఎట్టకేలకు హాజరైన అమరీందర్ సింగ్
-నాయకులకు, కార్యకర్తలకు తేడాలు లేవన్న సిద్ధూ
-ఈలలు వేస్తూ హర్షం వ్యక్తంచేసిన కార్యకర్తలు
-సిద్దు ప్రమాణ స్వీకారానికి వస్తున్నా వాహనానికి ప్రమాదం …ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల మృతి
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవలే నియమితుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. చండీగఢ్‌లోని కాంగ్రెస్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరయ్యారు. వేదికపై అమరీందర్ పక్కనే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూర్చున్నారు. తాను ప్రసంగించడానికి మైక్ వద్దకు వెళ్తున్న సమయంలో సిద్ధూ కుర్చీలోంచి లేస్తూ బ్యాటింగ్ శైలిని అనుకరించారు.
బ్యాటింగ్ చేస్తూ సిక్స్ కొట్టినట్టుగా పోజు ఇవ్వడం గమనార్హం. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈలలు వేశారు. కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తానని సిద్ధూ ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ లో నాయకులకు, కార్యకర్తలకు తేడాలు లేవని, అందరూ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. పంజాబ్‌లో విద్యుత్ కొరతను అధిగమిస్తామని చెప్పారు.
కాగా, అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సిద్ధూ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ అమరీందర్ డిమాండ్ చేశారు. అప్పటి వరకూ సిద్ధూను కలిసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అమరీందర్ సింగ్ రారని అందరూ అనుకున్నారు.
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ రోజు ఉదయం తేనీటి విందుకు అమరీందర్ సింగ్‌తో కలిసి సిద్ధూ పాల్గొన్నారు. తన ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న సీఎంకు సిద్ధూ లేఖ రాయడంతో ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌ఛార్జ్ హరీశ్ రావత్ కూడా హాజరయ్యారు. అమరీందర్, సిద్ధూ తేనీటి విందులో పాల్గొన్న సమయంలోనూ ఆయన అక్కడే ఉన్నారు.
సిద్ధూ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల మృతి
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన మినీ బస్సు
పంజాబ్ లోని లొహారా వద్ద ప్రమాదం
దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం
నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశం
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మినీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మోగా జిల్లాలోని లొహారా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తలు మరణించారు. పది మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.
చండీగఢ్ లో జరుగుతున్న సిద్ధూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నామంటూ ప్రమాదంలో స్వల్పగాయాలైన వారు చెప్పారు. గాయాలైన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించామని ఎస్ఎస్పీ హర్మన్ బీర్ సింగ్ గిల్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వారంతా కూడా ఎమ్మెల్యే కుల్బీర్ సింగ్ జీరా అనుచరులని తెలుస్తోంది. మోగాకు 15 కిలోమీటర్ల దూరంలోని జీరా నుంచి వారు బయల్దేరారని చెబుతున్నారు.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని మోగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని సూచించారు.