ముగిసిన యడియూరప్ప శకం … సీఎం రేసులో డజను మంది !
-వయోభారం కారణం చెబుతున్న హైకమాండ్
-స్థానికంగా పెరుగుతున్న వత్తిడే కారణమై ఉండవచ్చునంటున్న విశ్లేషకులు
-అధికార పీఠం నుంచి ఇక తప్పుకోనున్న యడియూరప్ప
-కర్ణాటకలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తెచ్చిన ఘనత యడియూరప్పదే
-బలమైన లింగాయత్ సామాజికవర్గ నేతగా యడ్డీకి గుర్తింపు
-సోమవారం సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం
దక్షిణాదిన ఏమాత్రం పట్టులేని బీజేపీని అధికారంలోకి తెచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప శకం ముగిసినట్లేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయపండితులు . 78 ఏళ్ళ యడియూరప్ప వయోభారం కారణం అని అధిష్టానం చెబుతున్న ఆయన పై రాష్ట్ర బీజేపీ లో అసమ్మతి వాదుల వత్తిడి కారణమై ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం . ఎట్టకేలకు యెడ్డీ రాజీనామాకు బీజేపీ నాయకత్వం ఒప్పించింది. ఇంతవరకు బాగానే ఉన్న యెడ్డీ స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టబోతున్నారు అనేది ఉత్కంఠతను రేకెత్తిసున్నది
కర్ణాటక రాజకీయాల్లో యడియూరప్పది ఒక ప్రత్యేకమైన చరిత్ర. రాష్ట్రంలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెపుతుంటారు. కర్ణాటకలో చాలా బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్పకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. అనేక మఠాధిపతులు కూడా ఆయనకు అండగా ఉన్నారు.
యడియూరప్ప నాయకత్వంలోనే కర్ణాటకలో బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని అధిరోహించింది. ఆ తర్వాత మధ్యలో బీజేపీ నుంచి ఆయన బటయకు వచ్చిన సందర్భంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అలాంటి బలమైన నేత యడియూరప్ప రాజకీయ ప్రస్థానం తుది అంకానికి చేరుకుంది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించేందుకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యడియూరప్ప కూడా ధ్రువీకరించారు.
ఈ నెల 26న తమ రెండేళ్ల పాలనపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని యడియూరప్ప తెలిపారు. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం సూచించినట్టు నడుచుకుంటానని చెప్పారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారిని కీలక పదవులలో కొనసాగించే సంప్రదాయం బీజేపీలో లేదని… అయితే తన కోసం రెండేళ్ల వెసులుబాటును హైకమాండ్ ఇచ్చిందని తెలిపారు. పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. తన గురించి ఎవరూ ఆందోళనలు చేయవద్దని విన్నవించారు. వచ్చే సోమవారం సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు కర్ణాటక సీఎం రేసులో డజను మందికి పైగా నేతల పేర్లు వినిపిస్తున్నాయి.