హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అమితాబ్, నాగార్జున..
-ఎంపీ సంతోష్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్
-రామోజీ ఫిల్మ్ సిటీలో కార్యక్రమం
-షూటింగ్ కోసం వచ్చిన అమితాబ్
హైదరాబాద్‌లో సినీనటులు అమితాబ్ బచ్చన్, నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు అమితాబ్ హాజరయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న సంతోష్ కుమార్ వారి వద్దకు వెళ్లి వారితో మొక్కలు నాటించి ఫొటోలు తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్ ఓ మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అమితాబ్‌కు సంతోష్ కుమార్ వివరించారు. మంచి కార్యక్రమం చేపట్టారని సంతోష్‌ను అమితాబ్ అభినందించారు .దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించడం గర్వకారణమని అమితాబ్ ప్రసంశించారు. ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను బిగ్ బి ప్రశంసించారు. ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, సంరక్షించటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అమితాబ్ గుర్తుచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నడంపై ఎంపీ సంతోష్ ఆనందం వ్యక్తం చేశారు.బిగ్ బీ లాంటి వ్యక్తి తన కార్యక్రమంలో పాల్గొనడం పై చెప్పారని మాటలు లేవన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.
కాగా, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. సంతోష్ కుమార్ ఇప్పటివరకు 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి కూడా పాల్గొన్నారు.