పై అధికారిపై ఇసుక తెచ్చి చల్లిన కింద అధికారి …షాక్ గురైన సిబ్బంది
-ఇసుక తెచ్చి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ముఖంపై చల్లిన అసిస్టెంట్ కమిషనర్
-విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో అధికారుల మధ్య విభేదాలు
-భూ ఆక్రమణలపై కిందిస్థాయి సిబ్బంది మీద ఆగ్రహం
-సహనం కోల్పోయిన మహిళా అధికారి
-అధికారిణిపై ఫిర్యాదు చేసిన డిప్యూటీ కమిషనర్
ఏపీ లో అధికారుల మధ్య యుద్ధం జరుగుతుంది . పాలనా పట్టు తప్పుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో కొందరు ఉద్యోగులు ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేస్తున్నారనే ఆరోపణలు పై వారిపై వేటు వేశారు.కొందరు ఉద్యోగులు ఇప్పటికి తాము పాత ప్రభుత్వంలోనే ఉన్నామనే అభిప్రాయంతో ఉన్నారు. విశాఖలో దేవదాయశాఖలో పని చేస్తున్న ఒక అసిస్టెంట్ కమిషనర్ ,డిప్యూటీ కమిషనర్ పై ఆఫీస్ లోనే ముఖంమీద ఇసుక తెచ్చి చల్లిన ఘటన దిగ్బ్రాంతి కి గురిచేసింది. ఇక్కడ ఇద్దరు ఉద్యోగులు మధ్య ఏమైనా ఉంటె పై అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ఇలా ప్రవర్తించడం పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ….
ఏపీ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ కు చేదు అనుభవం ఎదురైంది. తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్ కమిషనర్ తన ముఖాన ఇసుక తీసుకుని కొట్టడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలేం జరిగిందంటే…. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన తన కింది సిబ్బంది వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనేక పర్యాయాలు వారిని హెచ్చరించారు.
ఆయన చేతిలో మందలింపులకు గురైన వారిలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కూడా ఉన్నారు. శాంతిని తన చాంబర్ కు పిలిపించిన ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సహనం కోల్పోయిన శాంతి, తాను తీసుకువచ్చిన ఇసుకను కోపంతో ఆయనపై చల్లారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో, అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివరణ ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలను మనసులో ఉంచుకుని వేధించాడని, మానసిక వేదన భరించలేకే అతడిపై ఇసుక చల్లాల్సి వచ్చిందని తెలిపారు. అతడిపై ఇప్పటికే కమిషనర్ కు ఫిర్యాదు చేశానని, విచారణకు పిలిస్తే రాకుండా తన న్యాయవాదితో వస్తానని తప్పించుకున్నాడని ఆరోపించారు. అతడి తప్పేమీ లేకపోతే కమిషనర్ పిలిచినప్పుడు విచారణకు ఎందుకు రాలేదని శాంతి ప్రశ్నించారు.