పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్ టాపర్లు!
-టీనా దాబి, అథర్ ఖాన్ లకు విడాకులు మంజూరు
-2015లో టీనా టాపర్.. అథర్ రెండో ర్యాంకర్
-శిక్షణలో పరిచయం, ప్రేమ
-2018 ఏప్రిల్ లో వివాహం
-గత ఏడాది నవంబర్ లో విడాకులకు దరఖాస్తు
టీనా దాబి, అథర్ ఆమిర్ ఖాన్.. ఇద్దరూ ఐఏఎస్ టాపర్లు. 2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షలో టీనా టాపర్ అయితే.. అథర్ రెండో ర్యాంకర్. మతాలు వేరైతేనేం.. వారిద్దరి మనసులు కలిశాయి. 2018లో మతాంతర వివాహం చేసుకున్నారు. ఏమైందో ఏమోగానీ.. రెండేళ్లకే జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. తాజాగా కోర్టు ఆ దంపతులకు విడాకులను మంజూరు చేసింది.
2020 నవంబర్ లో పరస్పర అంగీకారంతో వారిరువురూ విడాకులకు దరఖాస్తు చేశారని వారి కుటుంబాలు చెబుతున్నాయి. రాజస్థాన్ కేడర్ కు చెందిన వారిద్దరూ ఇన్నాళ్లూ అక్కడే విధులు నిర్వర్తించారు. విడాకుల నేపథ్యంలో కశ్మీర్ కు చెందిన అథర్ ను అక్కడికే డిప్యూటేషన్ పై పంపించారు. ప్రస్తుతం శ్రీనగర్ లో డ్యూటీ చేస్తున్నారు.
శ్రీరామ్ లేడీ కాలేజీలో డిగ్రీ చేసిన టీనా దాబి.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ను సాధించిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు. శిక్షణ సమయంలో అథర్ ఖాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి 2018 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. ఆ వేడుకకు ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే, వారిద్దరి పెళ్లిపై నాడు వివాదం చెలరేగింది. ‘లవ్ జిహాద్’ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, వాటిని తాను పట్టించుకోనని, తమది మతాలకు అతీతమైన పెళ్లి అని ఆనాడు టీనా చెప్పుకొచ్చారు.