ఆందోళనలో పాల్గొన్నవారికి ఉద్యోగం నో
బీహార్ ప్రభుత్వం కఠిన నిర్ణయం
సర్కారు నిర్ణయంపై సర్వత్ర విమర్శలు
బీహార్ లో ఆందోళనలు నిర్వహించే అధికారాన్ని నితీశ్ కుమార్ ప్రభుత్వం లాగేసుకుంది. రాష్ట్రంలో ఆందోళనలకు దిగే ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాబోవని కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనలు చేసేవారు రిస్క్ లో పడతారని, విదేశాలకు వెళ్లాలని భావించే వారికి పాస్ పోర్టు కూడా లభించదని, ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగితే, వారికి కాండక్ట్ సర్టిఫికెట్ రాదని స్పష్టం చేసింది.
నితీశ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. విపక్ష నేత తేజస్వీ యాదవ్, ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తున్నారని మండిపడ్డారు. నితీశ్ ముస్సోలిని, హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, 40 సీట్లు మాత్రమే సాధించి పీఠాన్ని అధిష్టించిన ఓ వ్యక్తికి ఎంత భయంగా ఉందోనని నిప్పులు చెరిగారు.
కాగా, ఈ నెల 1న ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేస్తూ, రాష్ట్రంలో ఎవరైనా ఆందోళనలు, నిరసనలు చేస్తే, వారిపై పోలీసు చర్యలు తప్పబోవని హెచ్చరించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందబోవని, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని స్పష్టం చేసింది.
ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించటమేనని పలువురు ప్రభుత్వ విధానాలను తప్పు పడుతున్నారు. దీని వెంటనే ఉపసంహరించుకోవాలని లేక పొతే మరిన్ని ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.