ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం: అమెరికాలో రాజకీయ ప్రకంపనలు
-బైడెన్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్
-అమెరికా చరిత్రలో గొప్ప ఓటమి
-తాను అధ్యక్షుడయ్యుంటే ఇలా జరిగేది కాదంటున్న ట్రంప్
-డీల్ జరిగింది ట్రంప్ హయాంలోనే అంటున్న బైడెన్ ప్రభుత్వం
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం అమెరికాలో వేడి పుట్టిస్తోంది. దేశం తాలిబన్ వశం అవడం అమెరికా చరిత్రలో పెద్ద ఓటమని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. దీనికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యత వహించాలని, రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతోపాటు పెరుగుతున్న కరోనా కేసులు, ఆర్థిక, ఎనర్జీ పాలసీలు, జాతీయ ఇమిగ్రేషన్ విధానంలో లోపాలను ట్రంప్ ఎండగట్టారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కు తీసుకురావాలన్న ఆలోచన ట్రంప్ హయాంలోనే జరిగింది. దోహాలో తాలిబన్లతో ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ట్రంప్ హయాంలో ఒప్పందం చేసుకుంది. మే 2021 నాటికి అమెరికా సైన్యాన్ని వెనక్కు తీసుకెళ్తామని ట్రంప్ మాటిచ్చారు. ఈ విషయంలో తాలిబన్లకు కొన్ని షరతులు విధించారు. అయితే బైడెన్ అధికారంలోకి రాగానే, ఈ డెడ్‌లైన్‌ను మరికాస్త వెనక్కు నెట్టారు. ఆగస్టు 31 నాటికి అమెరికా సైన్యం పూర్తిగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో తాలిబన్లకు ఎటువంటి కండిషన్లూ పెట్టలేదు.
ఇంకా ఈ డెడ్‌లైన్‌కు పదిహేను రోజులు మిగిలుండగానే.. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైంది. ఈ విషయంలో అమెరికాలో కూడా బైడెన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వం కూలిపోవడంతో బైడెన్ విధానాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. తాను అధ్యక్ష పదవిలో ఉండి ఉంటే అమెరికా సైన్యం విజయవంతంగా స్వదేశానికి తిరిగొచ్చేదని, ఇలాంటి దారుణాలు జరిగేవి కావని ఆయన అన్నారు.
‘‘ఆఫ్ఘనిస్థాన్ లో బైడెన్ ఘనకార్యం చేశారు. ఇది అమెరికా చరిత్రలో అతిగొప్ప ఓటముల్లో ఒకటిగా నిలిచిపోతుంది’’ అని ట్రంప్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. అయితే బైడెన్ పాలకవర్గం మాత్రం.. ఈ డీల్ చేసుకుంది ట్రంప్ ప్రభుత్వమే అంటూ ఎత్తిచూపుతోంది.