పాక్ లో దారుణ ఘటన: యువతి బట్టలు చించి, గాల్లోకి విసిరేసి.. వికృత చర్య!
-పాకిస్థాన్ లో దారుణ ఘటన
-టిక్ టాక్ వీడియో తీస్తుండగా లైంగిక హింస
-నడిబజార్ లో నగ్నంగా నడిపించిన వైనం
-పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
-ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం
పాకిస్థాన్ కు మనకన్నా ఒక్కరోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందిగానీ.. అదే రోజు టిక్ టాక్ వీడియోలు చేసే ఓ యువతిపై వందలాది మంది మగాళ్ల రాక్షసత్వం ప్రపంచానికి తెలిసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. చుట్టూ మూగిన 400 మంది మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే అయ్యాయి. ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్ లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ లో తన ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాకర్ ను ఆ అల్లరి మూక హింసించింది.
గుమిగూడి ఆ అమ్మాయిపై 400 మంది అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడి బజార్ లో ఆ అమ్మాయిని బట్టల్లేకుండా నడిపించారు. అంతేకాదు.. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్ ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఆ బాధాకరమైన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నామా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
ఈ ఘటనపై బాధిత యువతి నిన్న లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మినారీ పాకిస్థాన్ వద్ద తన ఆరుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తుండగా.. 400 మంది తనను లైంగికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. ఆ అల్లరి మూకల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదని ఆవేదన చెందింది. కొందరు తనను కాపాడే ప్రయత్నం చేసినా.. గుంపు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని వాపోయింది. తనను గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించేసి వికృతానందం పొందారని ఆవేదన వ్యక్తం చేసింది.