‘సలాం తాలిబన్స్’ అంటూ పాక్ లో బాలికలతో బలవంతంగా గీతం పాడించిన వైనం..
ఆఫ్ఘన్‌లోని కాబూల్ విమానాశ్రయంలో తాలిబన్ల కాల్పులు.. తొక్కిసలాటలో ఏడుగురి మృతి..
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ చేరుకుని కన్నీరు పెట్టుకున్న ఎంపీ..
ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్ల కాల్పులు
ఆందోనళతో జనం పరుగులు
విమానంలో ఘజియాబాద్ చేరుకున్న పలువురు
అందులో ఆఫ్ఘన్ ఎంపీ నరేందర్ సింగ్ ఖాస్లా కూడా
ఆఫ్ఘన్‌లో పరిస్థితుల గురించి చెబుతూ కన్నీరు
20 ఏళ్ల శ్రమ వృథా అయిందని వ్యాఖ్య
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తుండగా పాకిస్థాన్ మాత్రం ఆ ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే. బాలికలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడమే కాకుండా, వారు మగతోడు లేనిదేబయటకు రావద్దని, చదువుకోవద్దని చెప్పే తాలిబన్లను పొగుడుతూ పాక్‌లో సమావేశాలు కూడా నిర్వహిస్తుండడం కలకలం రేపుతోంది. తాలిబన్ల విపరీత చేష్టలను పొగిడేలా బాలికలతో మత పెద్దలు గీతం ఆలపించేలా చేసిన వీడియో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మహిళల మదర్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లను పొగుడుతూ సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కూడా కనపడ్డాయి. దీంతో స్థానిక అధికారులు అక్కడకు చేరుకుని తాలిబన్ల జెండాలను తొలిగించారు. పాకిస్థాన్‌లో చిన్నారులపై తాలిబన్లు చాలా సార్లు దారుణాలకు పాల్పడి చంపేశారు. అయినప్పటికీ చిన్నారులతోనే బలవంతంగా సలాం తాలిబన్స్ అంటూ గీతం పాడించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతుండడంతో ఆ దేశం నుంచి వెళ్లిపోవడానికి పౌరులు పెద్ద ఎత్తున కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల్లో ఎక్కడానికి వారంతా ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు మృతి చెందినట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది.
కాబూల్ విమానాశ్రయంలో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్లే జనాలు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని బ్రిటన్ తెలిపింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్ శరణార్థులకు ఆశ్రయమిస్తామని అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు ప్రజలు వేలాది మంది కాబూల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ విమానాశ్రయం నుంచి భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానంలో 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది భారత్‌లోని ఘజియాబాద్ హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఎంపీ నరేందర్ సింగ్ ఖాస్లా కూడా ఉన్నారు. ఆయన భారత్‌లో మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను తలుచుకుంటేనే కన్నీరు వస్తోందని చెప్పారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన అనంతరం గత 20 ఏళ్లుగా నిర్మించింది మొత్తం ఇప్పుడు నాశనమైపోయిందని ఆయన చెప్పారు. కాగా, చాలా రోజుల నుంచి కాబూల్‌లోని గురుద్వారాలో కొందరు తాలిబన్లకు చిక్కకుండా దాక్కున్నారు. భారత్ చేరుకున్న సిక్కులను ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాకు తరలిస్తున్నారు.