పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం …..
అమరీందర్ రాజీనామా చేయాలంటున్న 30 మంది ఎమ్మెల్యేలు!
పంజాబ్‌లో వేడెక్కిన రాజకీయం
సీఎంపై సిద్ధు వర్గానికి చెందిన ఎమ్మెల్యేల గుస్సా
కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారులు
హైకమాండ్‌ను కలిసేందుకు సన్నద్ధమవుతున్న రెబల్ ఎమ్మెల్యేలు
పంజాబ్ కాంగ్రెస్ లో మరోసారి ముసలం పుట్టింది. సిద్దు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టడాన్ని సీఎం అమరిందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి రచ్చ మొదలైంది. ఇప్పుడు సీఎం రాజీనామా చేయాలనీ సిద్దు మద్దతు దారులైన 30 మంది ఎమ్మెల్యేలు పట్టు బట్టటం తో వాతావరణం వేడెక్కింది.
పంజాబ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సలహాదారులు ఇద్దరు కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీళ్ల మాటలపై ప్రతిపక్షంతోపాటు, అధికార పక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా సదరు సలహాదారుల వ్యాఖ్యలను తప్పుబట్టినట్లు సమాచారం. దీంతో సిద్ధూ వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా మారి అమరీందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారట. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. త్రిపాట్ రాజీందర్ బజ్వా, సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, చరణ్‌జీత్ సింగ్ చన్ని, సుఖ్‌బీందర్ సింగ్ సర్కారియాతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పర్గాత్ సింగ్.. వీళ్లంతా సిద్ధూ వర్గానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. వీళ్లు త్వరలోనే పార్టీ హైకమాండ్‌ను కలిసి అమరీందర్‌ను సీఎంగా తొలగించాలని కోరనున్నారట.
2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను త్రిపాట్ బజ్వాతో సమావేశమైనట్లు సిద్ధూ కూడా ట్వీట్ చేశారు. బజ్వాతోపాటు మరికొందరు పార్టీ కార్యకర్తలను కలిశానని, ప్రస్తుత పరిస్థితిపై హైకమాండ్‌కు వివరణ ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, సిద్ధూ సలహాదారుల్లో ఒకరైన మల్వీందర్ సింగ్ మాలి ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ‘‘కశ్మీర్ ఒక ప్రత్యేక దేశం. భారత్, పాకిస్థాన్ రెండూ అక్రమంగా ఆక్రమించుకున్నవే. ఇది కశ్మీర్ ప్రజల సొంతం’’ అని మల్వీందర్ ట్వీట్ చేశారు. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. దీంతోపాటు మరో సలహాదారు ప్యారే లాల్ గర్గ్ కూడా పాకిస్థాన్‌ను అమరీందర్ విమర్శించడాన్ని తప్పుబట్టి వివాదానికి తెరలేపారు.