తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు.. -ప్రభుత్వ ఆకస్మిక ఉత్తర్వులు
-సజ్జనార్ బదిలీ.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర
-ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బదిలీ
-మూడేళ్ల పాటు సైబరాబాద్ కమిషనర్ గా బాధ్యతలను నిర్వహించిన సజ్జనార్
-సమర్థవంతమైన పోలీసు అధికారిగా సజ్జనార్ కు గుర్తింపు
-ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్
-ఎస్ఐబీ చీఫ్‌గానే పరిమితం కానున్న ప్రభాకర్‌రావు
-ఇప్పటి వరకు రెండు విభాగాలకు పనిచేసిన ప్రభాకర్‌రావు
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను నియమించింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనర్ గా సజ్జనార్ మూడేళ్ల పాటు విధులు నిర్వహించారు. తన పదవీ కాలంలో ఆయన సమర్థవంతమైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఆయన హయాంలోనే చోటుచేసుకుంది. మరోవైపు స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.
అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేసింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 14 నెలల క్రితం ఐజీ హోదాలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) విభాగాధిపతిగా నియమితులైన ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందారు.
అయితే, ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం మూడేళ్లు పొడిగించి ఓఎస్డీగా నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే నిఘా విభాగం చీఫ్ నవీన్‌చంద్ పదవీ విరమణ చేయడంతో ప్రభాకర్‌రావుకు ఇంటెలిజెన్స్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏడాదిపాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గాను, ఎస్ఐబీ చీఫ్‌గానూ కొనసాగారు. అయితే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్‌కుమార్‌ను నియమించడంతో ప్రభాకర్‌రావు ఎస్ఐబీ ఓఎస్డీగా మాత్రమే కొనసాగుతారు.