తాలిబన్ల వేగం ఆశ్చర్యానికి గురి చేసింది: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్
ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమిస్తుందని ముందే ఊహించాం
కానీ ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రావత్
అమెరికా సైన్యం వెనుతిరిగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమిస్తారని ఊహించామని, కానీ వాళ్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న వేగం ఆశ్చర్యానికి గురిచేసిందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతోపాటు యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ అడ్మైరల్ జాన్ అక్విల్నో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాలిబన్లు ఆక్రమించిన ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎటువంటి ఉగ్రవాద ముఠాలు భారత్ వైపు వచ్చినా వాటిని తిప్పికొడతామని రావత్ స్పష్టంచేశారు. క్వాడ్ దేశాలు కూడా ఉగ్రవాదంపై పోరాడేందుకు సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశపరుచుకుంటారని ఊహించాం కానీ, అది ఇంత వేగంగా జరగడం ఆశ్చర్యపరిచిందని రావత్ వెల్లడించారు. గడిచిన 20 ఏళ్లలో తాలిబన్లు ఆ దేశంపై తమ పట్టుకోల్పోలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని రావత్ చెప్పారు. అయితే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అలాగే గడిచిన 20 ఏళ్లలో తాలిబన్లు మారలేదని, కేవలం వారి భాగస్వాములు మాత్రమే మారారని పేర్కొన్నారు. జాన్ అక్విల్నో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సార్వభౌమత్వానికి ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించారు. పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.