ఈటల పై తెలంగాణ మంత్రుల ఎదురు దాడి…
-ఈటలకు పౌల్ట్రీ పరిశ్రమ ఉందనే సీఎం కేసీఆర్ సాయం చేశారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
-ఈటలపై ధ్వజమెత్తిన తెలంగాణ మంత్రులు
-ఈటల వర్సెస్ హరీశ్ రావు
-హరీశ్ రావుకు మద్దతుగా స్పందించిన శ్రీనివాస్ గౌడ్
-ఈటల వ్యాఖ్యలకు ఖండన
-ఈటల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న హరీశ్ రావు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగారు. ఈటల నిన్న ఆర్థికమంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంగంలోకి దిగారు. హరీశ్ పై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. హరీష్ రావు తనపై ఈటల చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈటల ఎవరికోసం రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈటలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం రాయితీలు ప్రకటించారని, ఈటలకు కూడా పౌల్ట్రీ పరిశ్రమ ఉందన్న విషయాన్ని గమనించే సీఎం నిర్ణయం తీసుకున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటలకు పార్టీ వైపు నుంచే కాకుండా, వ్యక్తిగతంగానూ అండగా నిలిచారని తెలిపారు. టీఆర్ఎస్ లో వచ్చి పదవులు చేపట్టిన తర్వాత ఈటలకు గుర్తింపు వచ్చిందని, ఆయన ఉన్నతి వెనుక టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ ఉద్ఘాటించారు. ఇప్పుడు బీజేపీలో ఈటలకు ఏం గుర్తింపు ఉందని విమర్శించారు.
అటు, తనపై ఈటల వ్యాఖ్యలు చేయడం పట్ల హరీశ్ రావు స్పందించారు. ఈటల రాజేందర్ ఎవరికోసం రాజీనామా చేశారని ప్రశ్నించారు. “హుజూరాబాద్ ను జిల్లా చేయాలని రాజీనామా చేశారా? హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేశారా? వావిలాలను మండల కేంద్రం చేయాలని రాజీనామా చేశారా? తన స్వప్రయోజనాల కోసమే రాజీనామా చేశారు. ఈటలను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇక, నాపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఆయన విచక్షణకే వదిలేస్తున్నా” అని పేర్కొన్నారు.