కెమెరామన్‌ను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన రష్యన్ మంత్రి!
- మాక్‌డ్రిల్‌ను చిత్రీకరిస్తూ నీటిలో పడిపోయిన కెమెరామన్
- రక్షించేందుకు నీటిలో దూకిన మంత్రి
- తలకు రాయి తగలడంతో అక్కడికక్కడే మృతి
ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన కెమెరామన్‌ను రక్షించే క్రమంలో రష్యా మంత్రి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నొరిల్క్స్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఇక్కడ నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్రాన్ని అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రి జినిచెవ్ (55) సందర్శించారు.
ఈ సందర్భంగా రెస్క్యూటీం ప్రదర్శించిన మాక్‌డ్రిల్‌ను ఆయన పర్యవేక్షించారు. అదే సమయంలో ఈ మాక్‌డ్రిల్‌ను చిత్రీకరిస్తున్న ఓ కెమెరామన్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. గమనించిన మంత్రి వెంటనే ఆయనను రక్షించేందుకు నీటిలో దూకారు. ఈ క్రమంలో ఓ పెద్ద బండరాయికి తలకి తాకడంతో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జినిచెవ్ 2018 నుంచి రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఆయన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో సేవలు అందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రక్షణ వ్యవహారాల్లోనూ కొంతకాలంపాటు కొనసాగారు. జినిచెవ్ మృతికి పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.