Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

అందుకే ధోనీని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేశాం: సౌరవ్ గంగూలీ!

అందుకే ధోనీని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేశాం: సౌరవ్ గంగూలీ!
-ధోనిని మెంటర్ గా ఎంపిక చేయడంపై అభిమానులు హర్షిస్తున్నారు
-ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ఆడేందుకు ప్లేయర్స్ భయపడ్డమాట నిజం
-ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా పాత్రనే ధోని పోషిస్తాడు
– ప్లేయర్స్ ఆరోగ్యమే ముఖ్యం.’ మాకు ముఖ్యం

టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించిన సెలెక్షన్ కమిటీ.. ధోనీని మెంటార్‌గా జట్టులోకి తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మెంటార్‌గా ధోనీ ఏం చేస్తాడని, కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, సపోర్టింగ్ స్టాఫ్ ఉండగా.. అతను చేసేదేం ఉండదని గంభీర్, అజయ్ జడేజా వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.

తాజాగా టెలిగ్రాఫ్‌కు దాదా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ధోనీని టీమిండియా మెంటార్‌గా ఎంపికచేయడానికి గల ప్రధాన కారణాన్ని వివరించాడు. ధోనీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని, 2019లో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా సపోర్టింగ్ స్టాఫ్‌గా ఎలాంటి పాత్ర పోషించాడో.. టీ20 ప్రపంచకప్‌లో ధోనీది కూడా అలాంటి పాత్రేనని చెప్పుకొచ్చాడు. 2013 నుంచి భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదని, ఈ సారి ఎలాగైన టైటిల్ కొట్టాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు రచించామన్నాడు.

‘టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సాయంగా ఉంటాడనే ధోనీని మెంటార్‌గా ఎంపిక చేశాం. టీ20 ఫార్మాట్‌లో మహీకి భారత జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా మంచి రికార్డు ఉంది. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో చర్చల తర్వాతే ధోనీ అవసరం జట్టుకు ఉందని భావించాం. 2013 నుంచి భారత్ ఐసీసీ టైటిల్ గెలవలేదు. 2019 యాషెస్ సిరీస్‌లో స్టీవ్‌వా ఇలాంటి పాత్రే పోషించాడు. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఆ సిరీస్‌లో స్టీవ్ వా సలహాలతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 1-1‌తో సమం చేసి రిటైన్ చేసుకుంది. అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉంటే జట్టుకు మేలే జరుగుతుంది.’అని దాదా చెప్పుకొచ్చాడు.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2013లో గెలిచిన చాంపియన్స్ ట్రోఫీనే భారత్ చివరి ఐసీసీ టైటిల్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వంలో జట్టు 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయింది. పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఇక ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లోను కోహ్లీసేనకు నిరాశే ఎదురైంది. మళ్లీ న్యూజిలాండ్ చేతిలోనే ఖంగుతిన్నది.

ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ రద్దవ్వడంపై స్పందించిన గంగూలీ.. కరోనా కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నాడు. చివరి టెస్ట్ ఆడడానికి టీమిండియా ప్లేయ‌ర్స్ సుముఖంగా లేరనే విష‌యం నిజ‌మేన‌న్నాడు. కానీ ఐదో టెస్టును రద్దు చేయడంలో ఐపీఎల్ 2021 పాత్ర లేదని స్పష్టం చేశాడు. ‘బీసీసీఐ బాధ్యతారహితమైన బోర్డు కాదు. ఇతర బోర్డులను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఎవరికీ నష్టం వాటిల్లే విధంగా బీసీసీఐ వ్యవహరించదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లేయర్స్ ఆరోగ్యమే ముఖ్యం.’ అని గంగూలీ అన్నాడు.

ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ప్లేయ‌ర్స్ నిరాక‌రించారు. కానీ వాళ్ల‌ను కూడా ఈ విష‌యంలో అసలు నిందించ‌లేం. ఫిజియో యోగేశ్ పార్మ‌ర్ అప్ప‌టికే ప్లేయ‌ర్స్‌తో ట‌చ్‌లో ఉన్నాడు. నితిన్ ప‌టేల్ కూడా ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన త‌ర్వాత యోగేశ్ ఒక్క‌డే సహాయ బృందంలో మిగిలిపోయాడు. యోగేశ్ ప్ర‌తి రోజూ ఆటగాళ్లకు మ‌సాజ్ చేసేవాడు. అత‌నికి క‌రోనా సోకింద‌ని తెలియ‌గానే.. ప్లేయ‌ర్స్ అందరూ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌మ‌కూ క‌రోనా సోకుతుంద‌ని భ‌య‌ప‌డ్డారు’ అని దాదా చెప్పుకొచ్చాడు.

Related posts

ముంబై దాటికి కోల్ కత్తా విలవిలా….!

Drukpadam

ఐపీఎల్ లో రాహుల్ కు 17 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో …

Drukpadam

ఆసియా కప్ విజేత శ్రీలంక… ఫైనల్లో పాకిస్థాన్ కు భంగపాటు!

Drukpadam

Leave a Comment