ఒవైసీల మెప్పు పొందడానికి కేసీఆర్ యత్నిస్తున్నారు: మాజీ సీఎం రమణ్ సింగ్
- -బండి సంజయ్ సభకు హాజరైన చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్
- -కేసీఆర్ పాలనను అంతం చేయాలని పిలుపు
- -తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని వ్యాఖ్య
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతం చేయాలని చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో బహిరంగసభను నిర్వహించారు. ఆ సభకు రమణ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒవైసీ సోదరుల మెప్పు పొందడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని… అయితే, ఆ పథకాలను కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు.
దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టు రమణ్ సింగ్ తెలిపారు. తెలంగాణలో లక్ష 35 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని… అయినా వాటిని కేసీఆర్ భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.