ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం ,హత్య చేసిన రాజు …రైల్వే ట్రాక్ పక్కన శవంగా ….
-రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్య చేసుకున్నాడనే మేము భావిస్తున్నాం: వరంగల్ సీపీ
-రైల్వే ట్రాక్‌ను పరిశీలించిన సీపీ
-మృతదేహాన్ని మొదట రైల్వే కార్మికులు చూశారని వివరణ
-రాజు ఘన్‌పూర్ స్టేషన్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు
హైదరాబాద్‌లోని సైదాబాద్ బాలిక (6) హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతదేహాన్ని వరంగల్ పోలీసులు స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. ఈ రోజు ఉదయం 8.45 గంటలకు ఆ మృతదేహాన్ని కార్మికులు గుర్తించారని ఆయన ప్రకటించారు. మొదట రైల్వే అధికారులకు కార్మికులు సమాచారం ఇచ్చారని, అనంతరం డయల్ 100 ద్వారా తమకు సమాచారం అందిందని వివరించారు.
దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, అది రాజుదేనని గుర్తించినట్లు ఆయన వివరించారు. హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడనే తాము భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, అతను ఘన్‌పూర్ స్టేషన్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తామని తెలిపారు.
రాజు చావడం పీడపోవిందన్న అత్తమామలు
రాజు నా కుమార్తె జీవితాన్నీ నాశనం చేశాడు..
ఇటీవలే నా గొంతు పట్టుకున్నాడు: మౌనిక తల్లి
రెండేళ్ల క్రితం మౌనికతో రాజు పెళ్లి
కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మౌనిక
అత్తింటివారితోనూ రాజు గొడవలు
మద్యం మత్తులో అత్త యాదమ్మపై దాడి
చచ్చి మంచి పని చేశాడన్న యాదమ్మ
హైదరాబాద్‌లోని సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడికి రెండేళ్ల క్రితమే సూర్యాపేట జిల్లా జలాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆమె పేరునే రెండు చేతులపై రాజు పచ్చబొట్టు వేయించుకున్నాడు.
ఒక చేతిపై మౌనిక పేరు ఇంగ్లిష్‌లో, మరో చేతిపై తెలుగులో రాయించుకున్నాడు. రాజు భార్య ప్రసవం కోసం ఏడాది క్రితం జలాల్‌పురం వచ్చి అక్కడే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు అత్తింటిని వారిని కూడా వేధించేవాడని తెలిసింది. రెండు వారాల క్రితమే జలాల్‌పురం వెళ్లి మద్యం మత్తులో తన అత్తపై దాడి చేశాడు.
ఇప్పుడు రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హర్షం వ్యక్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక జీవితాన్ని కూడా నాశనం చేశాడని వాపోయింది. తన అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అతడు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె వ్యాఖ్యానించింది.
తన కుమార్తె మౌనికకు రాజు వల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె అంది. 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడవపడి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాదమ్మ తెలిపింది. అప్పుడు తమ గ్రామం నుంచి వెళ్లిన రాజు మళ్లీ రాలేదని చెప్పింది. కాగా, రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉండేవాడు.
రేపిస్ట్ రాజు ఆత్మహత్య చేసుకుని ఈ విషయాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు: వైఎస్ షర్మిల
మేము నిన్న చేసిన దీక్ష వల్లే ఈ రోజు మంత్రులు దిగొచ్చారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించారు
హైదరాబాద్‌లోని సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. తాము నిన్న చేసిన దీక్ష వల్లే ఈ రోజు మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారని ఆమె చెప్పుకొచ్చారు.
‘సింగరేణి కాలనిలో 6 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే 6 రోజులైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖం చెల్లని ఈ ప్రభుత్వ పెద్దలు.. మేము నిన్న చేసిన దీక్ష వల్ల దిగొచ్చి ఈ రోజు మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు’ అని షర్మిల చెప్పారు.
‘నిన్న, మొన్న ఆ కుటుంబాన్ని కలవడానికి రాని మంత్రులు ఈరోజు నిందితుడు చనిపోయిన తరువాత
ఆ కుటుంబాన్ని కలవడానికి పోటీ పడటానికి సిగ్గుండాలె. నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యానికి ఒక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రేపిస్ట్ ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు’ అని షర్మిల ట్వీట్లు చేశారు.
పోలీసులపై నమ్మకం లేదు.. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాల్సిందే: సైదాబాద్ బాధిత బాలిక తండ్రి
మృతదేహాన్ని తీసుకురావాలని డిమాండ్
తాము చూసి గుర్తుపడతామని స్పష్టీకరణ
రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని వ్యాఖ్య
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, చంపేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై.. బాధిత బాలిక తండ్రి స్పందించారు. పోలీసులపై తమకు నమ్మకం లేదని తేల్చి చెప్పారు. నిందితుడు చనిపోయాడంటే తాము నమ్మబోమని అన్నారు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. చనిపోయింది రాజేనా? కాదా? అన్న విషయాన్ని తాము గుర్తిస్తామని చెప్పారు. తమ బిడ్డను చేతుల్లో నుంచి లాక్కుపోయారు కదా.. ఇప్పుడు అతడి డెడ్ బాడీని తీసుకురావాల్సిందేనన్నారు.
అతడు బతికుంటే చంపేస్తామన్న భయం ఉండొచ్చేమో.. కానీ, ఇప్పుడు అతడు చనిపోయాడు కదా తీసుకురావడానికేంటి? అంటూ ప్రశ్నించారు. రాజు చనిపోయాడన్న వార్తలపై తమకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు. మృతదేహాన్ని చూస్తేనే నమ్ముతామన్నారు. ఆ రోజు రాజు గది తలుపులను పగులగొట్టమని మేం 7 గంటలకు డిమాండ్ చేస్తే.. 12 గంటలకు పగులగొట్టారని, అలాంటి పోలీసుల మాటలను తామెలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు.