సైదాబాద్ సింగరేణి కాలనీ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు రాజు ఆత్మహత్య!
- -ఇటీవల చిన్నారిపై అఘాయిత్యం
- -రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనపడ్డ రాజు
- -రెండు చేతులపై మౌనిక అని పచ్చబొట్టు
హైదరాబాద్‌లోని సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు రాజు స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనపడ్డాడు. అతడు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి రెండు చేతులపై మౌనిక పేరుతో వున్న పచ్చ బొట్టులతో అది అతడి మృతదేహమేనని స్పష్టమైంది.
రాజు కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టడంతో అతడు భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కాసేపట్లో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం సింగరేణి కాలనీలో పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 500 మంది ఉన్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, సెప్టెంబరు 9న సింగరేణి కాలనీలోని ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. చివరకు ఆమె నివసించే పక్కింట్లో ఉండే రాజు అనే యువకుడి ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. అప్పటికే రాజు ఆ ఇల్లు వదిలి పారిపోయాడు. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత చంపేసి, అక్కడి నుంచి పారిపోయాడని స్థానికులు ఆరోపించి, పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రాజు గురించి సమాచారం అందిస్తే రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేశారు.
మరోవైపు, ఈ రోజు ఉదయమే బాలిక తల్లిదండ్రులను తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మంత్రుల ముందు కూడా స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆ కొద్ది సేపటికే రాజు మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై గుర్తించామని పోలీసులు ప్రకటించడం గమనార్హం.
సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు ఇలా లభ్యమైంది!
- -ఎన్‌కౌంటర్ భయంతో వణికిపోయిన రాజు
- -ఆత్మహత్య చేసుకుంటాడని ముందుగానే భావించిన పోలీసులు
- -ఆ అనుమానంతో రైల్వే ప్రమాదాల మృతదేహాల పరిశీలన
- -చివరకు రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం గుర్తింపు
- -రాజు భార్య పేరు మౌనిక.. అతడి చేతులపై ఈ పేరే పచ్చబొట్లు
హైదరాబాద్‌లోని సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఏడు రోజులుగా కనపడకుండా పోయిన నిందితుడు రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్‌పై గుర్తించింది రాజు మృతదేహమేనని పోలీసులు నిర్ధారించారు. అంతకు ముందు రాజు ఆచూకీ కోసం పోలీసులు వేలాది సీసీ కెమెరాలను పరిశీలించారు.
ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తెలంగాణ అంతటా జల్లెడ పట్టారు. రాజును ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనంటూ పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో నిందితుడు భయపడిపోయి ఉంటాడని పోలీసులు ముందుగానే అంచనా వేశారు. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు కూడా ఉండడంతో రైల్వే ట్రాక్‌లపై కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
నిన్న రాజు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు. అలాగే, ఇటీవల రైలు ప్రమాద ఘటనలు, ఆత్మహత్యల్లో గుర్తు తెలియని మృతుల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. అంతేగాక, మార్చురీల్లో భద్రపరిచిన రైలు ప్రమాద మృతదేహాలను పరిశీలించారు.
మార్చురీల్లో రాజు మృతదేహం లభ్యం కాలేదు. చివరకు పోలీసులు భావించినట్లే రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి పరిశీలించగా అతడి ముఖం మొత్తం ఛిద్రమైకనపడింది.
అతడి చేతులపై చూడగా ‘మౌనిక’ అనే పచ్చబొట్లు ఉన్నాయి. రాజును గుర్తించడానికి ఇదే ప్రధాన ఆధారంగా ముందు నుంచీ పోలీసులు భావిస్తున్నారు. రాజు భార్య పేరు మౌనిక. గతంలో ఆయన రెండు చేతులపై మౌనిక పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. తాను ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేనని గ్రహించిన రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజు సెల్‌ఫోన్ వాడకపోవడం వల్లే అతడిని గుర్తించడం ఆలస్యమైంది.
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యపై కేటీఆర్ స్పందన
- -స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం
- -రాజు మృతదేహాన్ని గుర్తించామని డీజీపీ తెలిపారన్న కేటీఆర్
- -రాజు ఆత్మహత్యపై సర్వత్ర ఆనందం
హైదరాబాదులోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన రేపిస్ట్ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనపడ్డాడు. అతని చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఆధారంగా ఆ మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన దుర్మార్గుడిని ట్రేస్ చేశామని, అతని మృతదేహాన్ని స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై గుర్తించామని డీజీపీ తెలిపారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరోవైపు రాజు ఆత్మహత్యకు పాల్పడటంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాపం పండిందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజు మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం కావడంతో ఈ కేసును రైల్వే పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అయితే, రైల్వే పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు ఈ కేసును విచారించనున్నారు.