మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
- -భవానీపూర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బెంగాల్ సీఎం
- -బుధవారం గురుద్వారాను దర్శించిన మమత
- -భారీగా తరలివచ్చిన అభిమానులు
- -ఈసీకి లేఖ రాసిన బీజేపీ వర్గాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. భవానీపూర్ ఉపఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం నాడు స్థానికంగా ఉన్న గురుద్వారాను ఆమె సందర్శించారు. ఈ సమయంలో అభిమానులు భారీ సంఖ్యలో ఆమె వెంట వచ్చారు.
దీంతో ఆమె కరోనా నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సజల్ ఘోష్ ఆరోపించారు. ‘‘సెప్టెంబరు 15న భవానీపుర్ గురుద్వారాను సందర్శించే సమయంలో టీఎంసీ అభ్యర్థి కరోనా నిబంధనలు ఉల్లంఘించారు’’ అంటూ ఎన్నికల సంఘానికి సజల్ ఘోష్ లేఖ రాశారు. అలాగే మమత వెంట వచ్చిన కార్యకర్తలు కూడా మాస్కులు ధరించకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు.
అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని, రాజకీయ లబ్ధి కోసం చెబుతున్న అబద్ధాలని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది.