టీఆర్ యస్ ను పల్లెత్తు మాట అనని అమిత్ షా ..నిర్మల్ సభలో చప్పగా సాగిన ప్రసంగం!
-మజ్లిస్ కు బీజేపీ భయపడదు-2024 లో అధికారం ఖాయం :కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
-హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటలను గెలపించాలి
-విమోచన దినోత్సవం జరుపెందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు
-2023 లో తెలంగాణలో అధికారం బీజేపీదే
-సంజయ్ – రాజేందర్ కు అభినందనలు
-కిషన్ రెడ్డి పైన అమిత్ షా ప్రశంసలు
అమిత్ షా తెలంగాణ పర్యటనలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ విధానాలను చీల్చి చెండాడతాడని భావించిన ప్రజలకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు నిరాశ ఎదురైంది. టీఆర్ యస్ కు బీజేపీ కి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని పైకి కొట్టుకుంటున్నట్లు కనిపించినప్పటికీ బీజేపీ ,టీఆర్ యస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేవిధంగా అమిత్ షా ప్రసంగం సాగింది. అధికారంలో లోని మజ్లీస్ పై అస్త్రాలు ఎక్కుపెట్టిన అమిత్ షా కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని జరపటానికి భయపడుతున్నదని చెప్పటం వరకే పరిమితమైయ్యారు. సభలో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,ఈటల టీఆర్ యస్ పై నిప్పులు చెరిగారు. కానీ అమిత్ షా ముస్లింలను రెచ్చగొట్టేందుకు మాత్రమే తన ప్రసంగాన్ని వినియోగించుకొని , 2023 లో అధికారంలోకి వస్తామని చెప్పుకున్నారు. ఎంఐఎం కు బీజేపీ భయపడదని పేర్కొన్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనలో టీఆర్ యస్ విధానాలను తూర్పారబడతారని అలాంటిది లేకుండా ఆయన ప్రసంగం చప్పగా సాగింది.
మజ్లిస్ కు బీజేపీ భయపడదని..మత పరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్ షా అన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారని అమిత్ షా గుర్తు చేసారు. మరిప్పుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విమోచనోత్సవాన్ని కేసీఆర్ ఇపుడు మరిచిపోయారన్నారు. ఎంఐఎంతో బీజేపీ మాత్రమే పోరాడగలదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజని..ఈ సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్‌ను ఇస్తున్నామని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ పరాక్రమంతోనే 13 నెలల తరువాత భారత్‌లో తెలంగాణ కలిసిందన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం జరుతున్నామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయంటూ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్ కు పట్టవా అని నిలదీసారు. తెలంగాణలో ఆదీవాసీలు..ఎస్సీల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని..2023 ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లలో పార్టీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తంచేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు.
తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ నుంచి తొలి సారి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డిని ప్రధాని ఎంపిక చేసారంటూ అమిత్ షా వివరించారు. సభ ప్రారంభం సమయంలో..అదే విధంగా తన ప్రసంగం సమయంలోనూ అమిత్ షా ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా అభినందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను అమిత్ షా కోరారు. సభా ప్రాంగణం వద్ద అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..సచివాలయానికి వచ్చే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసారు. పటేల్ లేకుండా అసలు తెలంగాణ వచ్చేది కాదని..కేసీఆర్ సీఎం అయ్యే వారు కాదని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత అమిత్ షా కే దక్కుతుందన్నారు.