ఫైబర్ నెట్ కేసులో ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావు అరెస్ట్…
- -ఏపీ ఫైబర్ నెట్ లో వందల కోట్ల అక్రమాలు
- -కేసు నమోదు చేసిన సీఐడీ
- -గత ఐదు రోజులుగా సాంబశివరావుపై విచారణ
- -గతంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన సాంబశివరావు
ఫైబర్ నెట్ కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. సాంబశివరావు గతంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫైబర్ నెట్ తొలి దశలో రూ.320 కోట్ల టెండర్లలో రూ.121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది.
ఎండీ హోదాలో సాంబశివరావు టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ఆ సమయంలో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. అర్హత లేకపోయినప్పటికీ టెరాసాఫ్ట్ కు కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ గతంలో పేర్కొంది. టెరాసాఫ్ట్ తొలుత బ్లాక్ లిస్టులో ఉన్నప్పటికీ, ఒక్కరోజు వ్యవధిలోనే ఆ సంస్థను బ్లాక్ లిస్టు నుంచి తప్పించి టెండర్లు కట్టబెట్టారని తెలిపింది. కాగా, ఈ కేసులో 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, సీఐడీ విచారణను వేగవంతం చేసింది.