వైసీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు: జగన్ ఒప్పుకోలేదు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు!
-వైసీపీని విమర్శించే అర్హత పవన్ కు లేదు
-జగన్‌ను చూస్తే పవన్ కల్యాణ్‌కు అసూయ
-వైసీపీలో పవన్ చేరేందుకు జగన్ ఒప్పుకోలేదు
వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటానికి సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఆయనపై ఏపీ మంత్రులు వరుసగా విరుచుకుపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీని విమర్శించే అర్హత పవన్ కు లేదని చెప్పారు.
జగన్‌ను చూస్తే పవన్ కల్యాణ్‌కు అసూయ అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందే వైసీపీలో పవన్ కల్యాణ్ చేరాలని ప్రయత్నాలు జరిపారని ఆయన అన్నారు. అయితే, అందుకు జగన్ ఒప్పుకోలేదని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. తనకు అవసరం లేదని, ప్రజలు ఓట్లు వేస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని జగన్ అన్నారని నారాయణ స్వామి తెలిపారు.
ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పిన సింహం జగన్ అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. పవన్ ఏపీలోని గ్రామాల్లో పర్యటించవచ్చని, ఆయనపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఏపీలో జగన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆ ఈర్ష్యతోనే పవన్ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. పేదల కోసం జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.