Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజమండ్రి సభలో వైసీపీ పై పవన్ కళ్యాణ్ నిప్పులు …నార తీస్తానని వార్నింగ్ !

నా సహనాన్ని తేలికగా తీసుకోవద్దు.. నార తీస్తా: వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాను
పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది
రాష్ట్ర పెత్తనం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదు
సీఎం అని అరవద్దు..
పవర్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ అని పిలవండి: అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్
నేను సీఎం కావాలనే ఆకాంక్షను మీ మనసులో దాచుకోండి
వైసీపీ పాలనపై రెడ్డి సామాజికవర్గంలో కూడా బాధ ఉంది
నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సజ్జల యత్నించారు

రాజకీయాలు తనకు సరదా కాదని, బాధ్యత అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు పని కట్టుకుని తనను దూషిస్తున్నారని… తన సహనాన్ని తేలికగా తీసుకోవద్దని, తాట తీసి నారతీస్తానని హెచ్చరించారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే మనిషిని కాదని… పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని అన్నారు.

ఎన్నో ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని చెప్పారు. మనం కడుతున్న పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయని… ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని… ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరని అన్నారు.

రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని పవన్ చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చానని అన్నారు. శ్రమదానం చేయడం తనకు సరదా కాదని చెప్పారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదని అన్నారు. కులాల పేరుతో వైసీపీ నేతలు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి మంచిది కాదని అన్నారు. అన్ని కులాల్లో గొప్ప వ్యక్తులు ఉంటారని చెప్పారు.

సీఎం సీఎం అని అరవకండి…పవర్ స్టార్ అనికూడ పిలవద్దు …పవన్ కళ్యాణ్

రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా… ‘సీఎం.. సీఎం’ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ప్రతి చోటా ‘సీఎం.. సీఎం’ అని అరవద్దని చెప్పారు. ఈ మాటలు విని అలసిపోయానని అన్నారు. సీఎం అయినప్పుడే సీఎం అని అరవాలని చెప్పారు. తనను పవర్ స్టార్ అని కూడా పిలవద్దని… పవర్ లోకి వచ్చిన తర్వాతే పవర్ స్టార్ అని పిలవాలని సూచించారు. తాను సీఎం కావాలనే మీ ఆకాంక్షను మనసులో దాచుకోవాలని… ఇలా బయటకు చెప్పవద్దని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా పవన్ విరుచుకుపడ్డారు. గుంతలు లేని రోడ్డు రాష్ట్రంలో ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను అడ్డంపెట్టుకుని బిచ్చం వేస్తామంటే కుదరదని అన్నారు. కమ్మ సామాజికవర్గాన్ని వర్గ శత్రువులుగా ప్రకటించి మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేశారని చెప్పారు. వైసీపీ పాలనపై రెడ్డి సామాజికవర్గంలో కూడా బాధ ఉందని అన్నారు. తేలుకు పెత్తనమిస్తే అందరినీ కుళ్లబొడిచిందన్నట్టుగా.. అన్ని కులాలను వైసీపీ ప్రభుత్వం కుళ్లబొడుస్తోందని చెప్పారు.

వైసీపీ పాలనలో ఎవరికీ మాట్లాడే అధికారమే లేకుండా చేశారని… నోరు తెరిస్తే కొడతారని, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడతారని మండిపడ్డారు. కడప జిల్లాలో నలుగురు బీజేపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు హత్య చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులపై జరుగుతున్న దాడులకు అంతే లేదని అన్నారు.

ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకునే వ్యక్తిని తాను కాదని పవన్ హెచ్చరించారు. తన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి యత్నించారని… పోలీసులకు ఫోన్ చేసి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలస్ లో ఉన్న జగన్ ను రోడ్డుపై నడిచి అవి ఎలా ఉన్నాయో చూడమని చెప్పాలని సజ్జలకు హితవు పలికారు.

కారుపైకి ఎక్కి… పోలీసుల‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

ఏపీలోని రాజ‌మండ్రిలో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్ల‌డంలో ఆ ప్రాంతంలో పోలీసులు అడుగ‌డుగున ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ శ్ర‌మ‌దానం చేయాల‌నుకున్న ప్రాంతానికి ప‌వ‌న్ చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్టు నుంచి ప‌వ‌న్ వెంట వెళ్ల‌డానికి కొన్ని వాహ‌నాలకు మాత్ర‌మే అనుమ‌తులు ఇచ్చారు.

బాలాజీపేట సెంటర్ స‌మీపంలో, హుకుంపేట-బాలాజీపేట రోడ్డు వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకుంటున్న విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కారుపైకి ఎక్కి పోలీసుల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది? అంటూ ప్రశ్నించారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేక‌లు వేశారు. అనంత‌రం బాలాజీపేట‌కు చేరుకుని శ్ర‌మ‌దానంలో పాల్గొంటున్నారు.

 

Related posts

నా ప్రజాసామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు… గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తా: జేపీ నడ్డా!

Drukpadam

కేసీఆర్ కు ‘బీఆర్ఎస్’ సమస్య.. ఇప్పటికే ఈసీ వద్ద బీఆర్ఎస్ అప్లికేషన్లు!

Drukpadam

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు …బీఆర్ యస్ లో ఆతర్మధనం…!

Drukpadam

Leave a Comment