బద్వేల్ ఉపఎన్నికలో చేతులెత్తేసిన పవర్ స్టార్…
-బీజేపీ తో చర్చించిన పవన్ కళ్యాణ్ .. ఉప ఎన్నికకు ఆసక్తి చూపని బీజేపీ
-మేం అభ్యర్థిని నిలపడంలేదు:ఎన్నిక ఏకగ్రీవం చేసుకోండని వైసీపీకి సలహా
-అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన
-నాగులకనుమ వద్ద శ్రమదానం
-బద్వేలు ఉప ఎన్నికపై స్పష్టత
-జనసేన నేతలతో చర్చించామన్న పవన్
నిన్నటివరకు వైసీపీ పై విమర్శలు బాణాలు ఎక్కు పెట్టి తాట తీస్తా ,నార ఆరేస్తా… భయమంటే ఏమిటో చూపిస్తా …. తమాషా చేస్తున్నారా ? అంటూ గాండ్రించిన పవర్ స్టార్ వచ్చిన అవకాశాన్ని వాదులు కోవడం చేస్తుంటే … వైసీపీ కి ఆయన భయపడ్డారా ? లేక చేతులెత్తేశారా? వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారా ? ఏమి జరిగిందో ఏమిటో తెలియదు కానీ బద్వేల్ బరిలో నిలవడంలేదని చెబుతూనే వైసీపీ ని ఏకగ్రీవం చేసుకోండని సలహా ఇచ్చారు. దీనిపై జనసైనికులకే అర్థం కావడంలేదు. మంగళగిరి మీటింగులోను , రాజమండ్రి పర్యటనలోను పులిలా గాండ్రించిన పవర్ స్టార్ పిల్లిలా ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించడం ఏమిటనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ ఇవాళ ఏపీలో జనసేన శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న అనంతరం బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడంలేదని వెల్లడించారు.
మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని తెలిపారు.
అంతకుముందు పవన్ తనదైన శైలిలో ప్రసంగించారు. పాలకుల వద్ద డబ్బు ఉందని, కానీ వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జనసేనకు అధికారం ఇస్తే రాయలసీమలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయలసీమలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామని స్పష్టం చేశారు.
నాకు అవకాశం ఇవ్వండి… మీ కష్టాల్లో తోడుంటాను అని పేర్కొన్నారు. వైసీపీ మంత్రులు, నేతలతో గొడవలు వద్దని, కోపాన్ని గుండెల్లో దాచుకోవాలని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సమయం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దామని అన్నారు. మీ అందరి కోసం కుటుంబాన్ని వదిలి వచ్చానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు.