షారుఖ్ తనయుడికి తీవ్ర నిరాశ.. బెయిల్ కు నో చెప్పిన న్యాయస్థానం!
-డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుఖ్ ఖాన్ కుమారుడు
-ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ
-ఈ దశలో బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం
-సెషన్స్ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు తీవ్ర నిరాశ తప్పలేదు. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై నేడు ముంబయి కోర్టు విచారణ జరిపింది. ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయొద్దని ఎన్సీబీ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే, కేసు దర్యాప్తుపై ఆ ప్రభావం పడుతుందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న పిమ్మట… ఈ దశలో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆర్యన్ ఖాన్ కు నిన్న ముంబయి సిటీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ కోరగా, న్యాయస్థానం తిరస్కరించడం తెలిసిందే.