ప్రపంచ ఎలైట్ క్లబ్ లోకి ముఖేశ్ అంబానీ.. మస్క్, బెజోస్ సరసన చోటు!
- -100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన ఆసియా కుబేరుడు
- -11వ స్థానంలో నిలిచిన రిలయన్స్ అధినేత
- -షేర్ల విలువ పెరగడంతో భారీగా పెరిగిన సంపద
ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సరసన చేరిపోయారు. 10000 కోట్ల (వంద బిలియన్) డాలర్ల క్లబ్ లోకి ఎంటరయ్యారు. శుక్రవారం ఆయన సంస్థ రిలయన్స్ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో ఆయన సంపద కూడా పెరిగింది. దీంతో ఆయన 11 మంది ఉన్న వంద బిలియన్ డాలర్ల అత్యున్నత వర్గంలో చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం ముఖేశ్ ఆస్తులు 100.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.56 లక్షల కోట్లు) . ఈ ఏడాది ఇప్పటివరకు ఆయన సంపద 2,380 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.79 లక్షల కోట్లు) పెరిగింది. కాగా, దేశంలో ఆయన రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. 2005లో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ బిజినెస్ తో పాటు రిటైల్ రంగంలోకి అడుగుపెట్టారు. 2016లో జియోను ప్రవేశపెట్టి పెను సంచలనమే సృష్టించారు.
కాగా, ప్రస్తుతం 22,210 కోట్ల డాలర్లతో (సుమారు రూ.16.6 లక్షల కోట్లు) ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన మొత్తం సంపద 19,080 కోట్ల డాలర్లు (సుమారు రూ.14.35 లక్షల కోట్లు). కాగా, మొత్తంగా ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.