Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉత్తరాఖండ్ లో బీజేపీ షాక్ …కాంగ్రెస్ లో చేరిన మంత్రి!

ఉత్తరాఖండ్ లో బీజేపీ షాక్ …కాంగ్రెస్ లో చేరిన మంత్రి!
-మంత్రి తనయుడు ఎమ్మెల్యే అయిన సంజీవ్ సైతం బీజేపీకి గుడ్ బై
-కాంగ్రెస్‌లో చేరడానికి ముందే గవర్నర్‌కు రాజీనామా లేఖలు
-బీజేపీలో ఒక్క రోజు కూడా సంతోషంగా లేనన్న యశ్‌పాల్ ఆర్య
-పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ

మరికొద్ది నెలల్లో ఎన్నికలకు సిద్దమౌతున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ,ఎమ్మెల్యే గా ఉన్న ఆయన కుమారుడు ఇద్దరు బీజేపీ కి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన బీజేపీ ప్రజల్లో పట్టును కోల్పోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తిరిగి ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనుకున్న కమలనాథులకు అక్కడ మంత్రి రాజీనామా చేయడం మింగుడుపడని విషయంగా ఉంది. బీజేపీ కి రాజీనామా చేసిన మంత్రి రాష్ట్రంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రానున్న ఎన్నికలపై దీనిప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడైన ఎమ్మెల్యే సంజీవ్‌ ఆర్య బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న సీనియర్ నేతలు హరీశ్ రావత్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యశ్‌పాల్ గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సూర్జేవాలా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దళితుల అభివృద్ధికి యశ్‌పాల్ విశేష కృషి చేశారని కొనియాడారు. కాగా, కాంగ్రెస్‌లో చేరడానికి ముందే యశ్‌పాల్, ఆయన కుమారుడు సంజీవ్ తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపారు.

Related posts

రేవంత్‌రెడ్డి అంతు చూస్తాం… అక్కడ చూపిస్తే రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేటీఆర్

Ram Narayana

పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటిస్తే కోర్టుకెళ్తా: చిరాగ్ పాశ్వాన్

Drukpadam

రాష్ట్రాల దయాదాక్షిణ్యాల వల్లే కేంద్రం బతుకుతోంది: తలసాని

Drukpadam

Leave a Comment