వంట నూనె ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి.. ఏపీ సహా 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు…
-నూనెలపై విధిస్తున్న 2.5 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించిన కేంద్రం
-తగ్గిన సుంకం ప్రయోజనం వినియోగదారులకు అందించాలని లేఖ
-వినియోగదారులకు కిలోకు రూ. 20 వరకు లబ్ధి చేకూరే అవకాశం
వంటనూనెలు ధరలు తగ్గించమని కేంద్రం వివిధ రాష్ట్రాలకు లేఖ రాయడం స్వాగతించాల్సిందే … నూనెలపై విధిస్తున్న 2.5 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించినందున ఆ ప్రయోజనం వినియోగదార్లకు చేరే విధంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దీనివల్ల ఎక్కువమొత్తంలో వినియోగదారులు లబ్ది పొందే అవకాశం ఉందని కేంద్రం పేర్కొన్నది .
దేశంలో వంటనూనె ధరలు భగ్గుమన్న వేళ దిగుమతి సుంకాలను తగ్గించిన కేంద్రం.. తాజాగా ఆంధ్రప్రదేశ్ సహా నూనెను ఉత్పత్తి చేస్తున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. దిగుమతి సుంకాలు తగ్గిన నేపథ్యంలో నూనె ధరలు తగ్గేలా చూడాలని ఆ లేఖలో కోరింది.
సుంకం తగ్గించడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా వారిపై ధరల భారం పడకుండా చూడాలని కోరింది. ఇలా చేయడం వల్ల కిలోపై రూ. 15-20 లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. కాగా, వంట నూనె ధరలు భగ్గుమనడంతో స్పందించిన కేంద్రం.. పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై విధిస్తున్న 2.5 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించింది.