Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్కే మరణాన్ని ధ్రువీకరిస్తూ మావోయిస్టు పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల‌!

  • మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ప్రకటన
  • ఆర్కే నిన్న ఉదయం 6 గంటలకు మృతి చెందిన‌ట్లు వివ‌ర‌ణ‌
  • ఆర్కే కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడ్డార‌ని వెల్లడి
  • పార్టీ ప్రకటనతో కన్నీటిపర్యంతమైన భార్య శిరీష

మావోయిస్టు అగ్ర‌నేత ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆయ‌న మృతి చెందినట్టు వస్తున్న వార్త‌లు నిజ‌మేన‌ని ధ్రువీకరించింది. ఈ మేర‌కు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.

ఆర్కే నిన్న ఉదయం 6 గంటలకు మృతి చెందిన‌ట్లు ఆయ‌న ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్కే కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న నేప‌థ్యంలో మృతి చెందిన‌ట్లు వివ‌రించారు. ఆయ‌న‌ మృతి తమ పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆర్కే 1978లో పీపుల్స్‌ వార్‌ సభ్యత్వం తీసుకున్నారని, 1982 నుంచి పూర్తిస్థాయి కార్యకర్తగా వచ్చారని వివ‌రించారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారని, అనంత‌రం 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగానూ ప‌నిచేశార‌ని గుర్తు చేశారు.

2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఆర్కే కీలక పాత్ర పోషించారని, అయితే, అనంత‌రం ఆర్కే హత్యకు ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించిందని వివ‌రించారు. 

మరోపక్క, ఆర్కే మృతి చెందార‌ని మావోయిస్టు పార్టీ ప్రకటన చేయడంతో ఆయన భార్య శిరీష క‌న్నీటి పర్యంతమయ్యారు. త‌న భ‌ర్త మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని తెలిపారు. మావోయిస్టులకు పోలీసులు వైద్యం కూడా అందనీయడం లేదని ఆమె ఆరోపించారు. ఆర్కే మరణంపై విరసం నేత కల్యాణరావు స్పందిస్తూ ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని చెప్పుకొచ్చారు. పోలీసులపై ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు.

Related posts

‘ఇంటింటికి బీజేపీ’కి దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్ కు అధిష్ఠానం పిలుపు!

Drukpadam

ఉక్రెయిన్‌ పై ర‌ష్యా చేస్తోంది భీక‌ర యుద్ధ‌మే..

Drukpadam

సహాయం కోసం కేటీఆర్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ట్వీట్

Drukpadam

Leave a Comment