జయలలిత సమాధి వద్ద కంటతడి పెట్టిన శశికళ!
జయకు నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి గురైన శశికళ
వందలాది మందితో భారీ ర్యాలీగా వచ్చిన వైనం
శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా
తమిళనాడు రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుదామని అనుకున్న శశికళ ,అనూహ్య పరిణామాల మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల భరినుంచి తప్పుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమెపై వత్తిడి తెచ్చినందునే ఆమె వెనకడుగు వేశారని అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. చాల కాలం బెంగుళూరు లోని జైల్లో ఉన్న శశికళ విడుదలై చెన్నై వచ్చిన సందర్భంగా ఆమెకు కర్ణాటక బోర్డర్ నుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమెకు ప్రజలను నుంచి వచ్చిన స్పందన చూసి అప్పటి ఏ ఐ డీఎంకే ప్రభుత్వమే కంగుతిన్నది . ఆమె ఏ ఐ డీఎంకే పగ్గాలు చేపడతారని భావించారు. కానీ అది జరగలేదు .ఆమె ఎన్నికల్లో సైలెంట్ అయ్యారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు ఆమె చెన్నై, మెరీనా బీచ్ లోని జయలలిత, ఎంజీఆర్ స్మారకాల వద్దకు వందలాది మంది అనుచరులతో భారీ ర్యాలీగా చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టారు. జయకు నివాళి అర్పించిన శశికళ… కన్నీళ్లను తుడుచుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
ఆమె ప్రయాణించిన వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉంది. దీనిపై అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి పార్టీ జెండాను ఎలా పెట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.