- నిన్న సిరిసేడులో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
- సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని వినోద్ ఆరోపణ
- అందుకే తమ కుర్రాళ్లు ముందుకు ఉరికారని వెల్లడి
నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. సిరిసేడు వద్ద కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీనిపై టీఆర్ఎస్ సీనియర్ నేత బి.వినోద్ కుమార్ స్పందించారు.
సిరిసేడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముందు ఆగిన కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారని, అందువల్లే తమ కార్యకర్తలు ఆవేశానికి గురయ్యారని వివరణ ఇచ్చారు. ఎక్కడో రోడ్డు మీద నినాదాలు చేసుకుంటే పట్టించుకునేవాళ్లు కాదని, టీఆర్ఎస్ ఆఫీసు పక్కకు వచ్చి వ్యాఖ్యలు చేస్తే కుర్రాళ్లు కోపంతో ముందుకు ఉరికారని వెల్లడించారు.
సిరిసేడులో కిషన్ రెడ్డిపై దాడి జరిగిందని బండి సంజయ్ అంటున్నారని, అందులో వాస్తవంలేదని తెలిపారు. తమ కార్యకర్తలు ఆవేశంతో ముందుకు రాగా, పోలీసులు వారిని నెట్టివేశారని వివరించారు. కిషన్ రెడ్డిపై దాడి చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలపై కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. తాము ఓట్ల కోసమో, ఎన్నికల కోసమో పథకాలు తీసుకురావడంలేదని, ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలనే పథకాలుగా తీసుకువస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోలో లేకపోయినా రైతు బంధు తీసుకువచ్చామని తెలిపారు.