రాష్ట్ర అవతరణతో ఏ సంబంధం లేని వైఎస్సార్ పేరుతో నేడు పురస్కారాలా?: సీఎం జగన్ పై అయ్యన్న ధ్వజం!
-నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
-వైఎస్సార్ పేరిట అవార్డులు ప్రదానం చేసిన జగన్
-ఇది దారుణం అంటూ అయ్యన్న వ్యాఖ్యలు
-పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అపహాస్యం చేశారని వెల్లడి
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కాగా, నేడు వైఎస్సార్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను సీఎం జగన్ ప్రదానం చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఏ సంబంధంలేని మీ తండ్రి వైఎస్సార్ పేరుతో నేడు పురస్కారాల కార్యక్రమం నిర్వహంచడం తప్పు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలనే తృణప్రాయంగా వదిలిన మహనీయుడు అని, అలాంటి వ్యక్తి త్యాగాన్ని అపహాస్యం చేసేలా మీరు నిర్వహించిన సభ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకా? అని నిలదీశారు. వైఎస్సార్ జయంతి లేదా వర్ధంతి నాడు ఆయన పేరుతో అవార్డులు ఇచ్చుకుంటే తప్పులేదని తెలిపారు. కానీ ఇవాళ పొట్టి శ్రీరాములు పేరుతో కాకుండా వైఎస్సార్ పేరుతో పురస్కారాలు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్న ప్రభుత్వం…. నేడు అమరజీవికి ఒక దండేసి చేతులు దులుపుకోవడం ఆ మహనీయుని త్యాగాలను అవమానించడమేనని అయ్యన్న విమర్శించారు.