శబరిమలలో ఈ నెల 16 నుంచి దర్శనాలు… కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు!
-ఈ నెల 15న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
-రోజుకు 30 వేల మంది భక్తులకు అనుమతి
-కరోనా నెగెటివ్ వస్తేనే అనుమతి
-కొవిడ్ టీకాలు రెండు డోసులు తీసుకుని ఉండాలన్న దేవస్థానం
కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సుదీర్ఘ విరామానంతరం తెరుచుకోనుంది. ఎల్లుండి సోమవారం సాయంత్రం దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు. ఆ మరుసటి రోజు (నవంబరు 16) నుంచి స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. రోజుకు 30 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
కాగా, కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు. శబరిమల దర్శనానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని, నెగెటివ్ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి లభిస్తుంది. అది కూడా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలి. దర్శనానికి వచ్చేవారు విధిగా తమ వెంట ఆధార్ కార్డు (ఒరిజినల్)ను తీసుకురావాలని ట్రావెన్ కూర్ దేవస్వోం వర్గాలు స్పష్టం చేశాయి. పంపానదిలో స్నానానికి అనుమతి ఇచ్చారు. అయితే దర్శనం పూర్తయిన వెంటనే భక్తులు ఆలయ పరిసరాల నుంచి వెళ్లిపోవాలి. బస ఏర్పాట్లకు అనుమతి లేదు.
శబరిమలలో డిసెంబరు 26న మండల పూజ ముగుస్తుంది. డిసెంబరు 30న మకర విళక్కు కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
కరోనా నేపథ్యంలో శబరీ దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండ నిబంధనలు పాటించాలని దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు భక్తులు వస్తున్నందున వారు తప్పకుండ వ్యాక్సిన్ వేసుకొని ఆర్ టి పిసిఆర్ టెస్ట్ చేయించుకొని రావాల్సిందేనని స్పష్ష్టం చేసింది. అంతేకాకుండా వ్యాక్సిన్లవేయించుకున్న వివరాలు , ఆధార్ కార్డు తో సహా హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని తూచ తప్పకుండ భక్తులు పాటించి సహకరించాలని కోరింది. శబరీ లో వాటికి అవకాశం లేదని కూడా తేల్చి చెప్పింది.