- అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం… హాజరైన సీఎం జగన్
-తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి భేటీ
-హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
-సమావేశానికి సీఎంలు, మంత్రులు, అధికారులు
-కీలక అంశాలను ప్రస్తావించనున్న సీఎం జగన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీ రాత్రి 7 గంటల వరకు సాగనుంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్నుముడి, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు.
ఈ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో గత సమావేశ నిర్ణయాలకు సంబంధించిన 2 నివేదికలపై చర్చించనున్నారు. 24 కొత్త అంశాలతో పాటు తదుపరి సమావేశ వేదిక ఖరారు అంశాలను కూడా చర్చించనున్నారు.
జోనల్ కౌన్సిల్ భేటీలో ఏపీ అజెండా ఇదే!
అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో తన బాణీని బలంగా వినిపించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఏడు అంశాలను కేంద్రానికి నివేదించనున్నారు. ఏపీ మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి విరివిగా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి నిధుల్లో పెండింగ్ లో ఉన్న రూ.1000 కోట్లు ఇవ్వాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్నారు.
తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,015 కోట్ల బకాయిల విషయాన్ని కూడా సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా, తెలుగుగంగకు తెలంగాణ బకాయిపడిన రూ.338 కోట్లు ఇవ్వాలని కోరనున్నారు.
విభజన చట్టంలో ఉన్న మేరకు రామాయపట్నం ఓడరేవు, స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఏడీపీ రుణాన్ని గ్రాంటుగా మార్చే వెసులుబాటు అంశాలను కూడా సీఎం జగన్ ప్రస్తావించనున్నారు.
ఏపీ సముద్ర జలాల్లోకి తమిళనాడు ఫిషింగ్ బోట్లు ప్రవేశించడాన్ని ఈ సమావేశంలో ఎత్తిచూపనున్నారు. అటు, కుప్పంలోని పాలారు నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు పట్ల తమిళనాడు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు సీఎం జగన్ నేటి సమావేశంలో వివరణ ఇవ్వనున్నారు. జాతీయ పోలీస్ అకాడమీ తరహాలో ఏపీలో జాతీయ జైళ్ల అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదన చేయనున్నారు.