కుప్పం పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు తావులేదు : ఎస్ఈసీ నీలం సాహ్నీ!
-కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు
-అక్రమాలు జరిగాయన్న టీడీపీ
-పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న ఎస్ఈసీ
-నిఘానీడలో పోలింగ్ జరిగిందని సృష్టికరణ
-ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారని వెల్లడి
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ స్పందించారు. కుప్పం పురపాలక ఎన్నికలను అక్రమాలకు తావులేని విధంగా నిర్వహించామని తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. కుప్పంలో పోలింగ్ బూత్ వెలుపల చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే, పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వెల్లడించారు.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనేది కొందరు చేస్తున్న ప్రచారంగా ఆమె కొట్టి పారేశారు. ఏంటో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వించామని అన్నారు. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయని ,కొంత సెన్సెటివ్ గా ఉన్నందున ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలనీ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు.
ఆయా పార్టీల ఏజెంట్లు పోలింగ్ బూత్ లలోనే ఉన్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ కుప్పంలోనే ఉండి శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారని వివరించారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి పోలింగ్ బూత్ కు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారని తెలిపారు. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించామని అన్నారు . సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిఘాలో పోలింగ్ జరిగిందని నీలం సాహ్నీ స్పష్టం చేశారు. పోలింగ్ లో ఎక్కడ పొరపాట్లు జరగటానికి తావులేదని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.