రాష్ట్రపతి కావాలనే కోరిక నాకు లేదు ….ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు…
-వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నానన్న చిరంజీవి
-రాజకీయాలు వదిలేసి చిరంజీవి మంచి పని చేశారు
-ప్రస్తుత రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయి
-నాకు రాష్ట్రపతి కావాలనే కోరికేం లేదు
-ప్రజలకు దూరంగా ఉండటం ఇష్టంలేదు …
-అయితే కొంచెం తొందరగా పడుకుంటున్నాను
-కరోనా ఇంకా పోలేదు …నిబంధనలు పాటించండి
రాజకీయాలు వదిలేసి చిరంజీవి చాలా మంచి పని చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని, నేతలు మాట్లాడుతున్న భాష అసలు బాగుండటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు తనకు నచ్చడం లేదని అన్నారు. ఉపరాష్ట్రపతి కావడం వల్ల ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తోందని, ఇది తనకు కొంచెం ఇబ్బందిగా ఉందని… అయితే, ఈ పదవి వల్ల కొంచెం తొందరగా పడుకుంటున్నానని నవ్వుతూ చెప్పారు. తాను రాష్ట్రపతి కావాలనేది చిరంజీవి కోరిక అని, తన శ్రేయోభిలాషులు చాలా మంది ఇదే కోరుకుంటున్నారని… కానీ రాష్ట్రపతి కావాలనే కోరిక తనకేం లేదని అన్నారు. కరోనా ఇంకా పోలేదని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. మోదీ కోసమో, కేసీఆర్ కోసమో కాకుండా… మన కోసం మనం రూల్స్ పాటించాలని చెప్పారు. హైదరాబాదులో ఈరోజు యోధ డయోగ్నస్టిక్ సెంటర్ ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నా: చిరంజీవి
అంతకు ముందు కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయ్యప్ప సాక్షిగా ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమాజానికి చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని సినీ నటుడు చిరంజీవి కొనియాడారు.
హైదరాబాదులోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను ఈరోజు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ లో పరీక్షలు చేయించుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు.