తమిళ బ్రాహ్మణ యువకులకు పెళ్లి కష్టాలు… యూపీ, బీహార్ రాష్ట్రాల్లో వధువుల కోసం వేట!
- తమిళనాడులో బ్రాహ్మణ యువతుల కొరత
- పెళ్లి కోసం ఎదురుచూస్తున్న 40 వేల మంది
- తమిళనాడు బ్రాహ్మణ సంఘం స్పెషల్ డ్రైవ్
- ఇతర రాష్ట్రాల్లో కోఆర్డినేటర్ల నియామకం
తమిళనాడులో బ్రాహ్మణ యువకులకు పెద్ద కష్టం వచ్చిపడింది! రాష్ట్రంలో ఎంత వెదికినా బ్రాహ్మణ వధువులు దొరకడంలేదట. దాదాపు 40 వేల మంది బ్రాహ్మణ యువకులు తమకు ఈడైన పెళ్లికూతుర్లు దొరక్క పడిగాపులు కాస్తున్న విషయం తాజాగా వెల్లడైంది. దాంతో ఓ బ్రాహ్మణ సంఘం ఏకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. బ్రాహ్మణుల జనాభా అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వధువుల వేట షురూ చేసింది.
దీనిపై తమిళనాడు బ్రాహ్మిన్ అసోసియేషన్ (తమ్ బ్రాస్) అధ్యక్షుడు ఎన్.నారాయణన్ స్పందిస్తూ, బ్రాహ్మణ యువకులకు పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు తమ సంఘం తరఫున ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని వెల్లడించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ కూడా సదరు బ్రాహ్మణ సంఘం మాసపత్రికలో ప్రచురితమైంది.
కాగా, నారాయణన్ స్పందిస్తూ 30 నుంచి 40 ఏళ్ల వయసున్న దాదాపు 40 వేల మంది… వధువులు దొరక్క పెళ్లి చేసుకోలేకపోతున్నారని వివరించారు. తమిళనాడులో సగటున 10 మంది బ్రాహ్మణ యువకులు పెళ్లీడుకు వచ్చి ఉంటే, ఆరుగురు బ్రాహ్మణ అమ్మాయిలే అందుబాటులో ఉంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో తమ కుర్రాళ్లకు సంబంధాలు చూసేందుకు ఢిల్లీ, లక్నో, పాట్నా ప్రాంతాల్లో కోఆర్డినేటర్లను నియమించామని తెలిపారు.